చీప్.. వెరీ.. చీప్.. రైళ్లలో దుప్పట్లు దొంగిలిస్తున్న ఏసీ కోచ్ ప్రయాణికులు! పాపం.. వారి జీతం కట్!

రైళ్ల ఏసీ కోచ్‌లలో అందించే బెడ్‌రోల్ వస్తువులను కొందరు ప్రయాణికులు తిరిగి ఇవ్వకపోవడం వల్ల భారీ నష్టం జరుగుతోంది. ఈ నష్టాన్ని కొన్ని సందర్భాల్లో అటెండెంట్ల జీతాల నుంచి వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. 2022–2026 మధ్య 1.27 కోట్ల లినెన్ వస్తువులు అదృశ్యమైనట్లు నివేదికలు వెల్లడించాయి.

చీప్.. వెరీ.. చీప్.. రైళ్లలో దుప్పట్లు దొంగిలిస్తున్న ఏసీ కోచ్ ప్రయాణికులు! పాపం.. వారి జీతం కట్!
Indian Railways Ac Coach Be

Updated on: Jul 14, 2026 | 7:02 PM

సాధారణంగా రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వేస్ బెడ్‌రోల్ కిట్‌ను అందిస్తుంది. ఇందులో బెడ్‌షీట్లు, దుప్పటి, దిండు కవర్, టవల్ వంటివి ఉంటాయి. అయితే ప్రయాణం ముగిసిన తర్వాత కొందరు ప్రయాణికులు వీటిని తిరిగి అక్కడే పెట్టేయకుండా తమ వెంట, దొంగతనంగా తీసుకెళ్తున్నారు. దీని వల్ల రైల్వేకు భారీ నష్టం కలుగుతోంది. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఈ నష్టం భారాన్ని చాలా సందర్భాల్లో కోచ్ అటెండెంట్లే భరించాల్సి వస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.

పలు నివేదికల ప్రకారం.. 2022 నుంచి 2026 మే వరకు దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌ల నుంచి సుమారు 1.27 కోట్ల లినెన్ వస్తువులు (బెడ్‌షీట్లు, టవల్స్, దుప్పట్లు, దిండు కవర్లు తదితరాలు) అదృశ్యమైనట్లు పేర్కొంది. వీటి మొత్తం అంచనా విలువ రూ.104.51 కోట్లుగా వెల్లడించింది. దొంగిలించబడిన వస్తువుల్లో టవల్స్ అత్యధికంగా ఉన్నాయి. నాలుగేళ్లలో సుమారు 46.54 లక్షల టవల్స్, 41.13 లక్షల బెడ్‌షీట్లు, 23.59 లక్షల దిండు కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు, 2.76 లక్షల దిండ్లు కనిపించకుండా పోయినట్లు నివేదిక తెలిపింది.

ఈ నష్టానికి సంబంధించిన పరిహారాన్ని కొన్ని సందర్భాల్లో అటెండెంట్ల జీతాల నుంచి వసూలు చేస్తున్నట్లు పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒక సూపర్‌వైజర్ వివరాల ప్రకారం.. ఒక దిండు పోతే రూ.115, బెడ్‌షీట్‌కు రూ.198, దిండు కవర్‌కు రూ.55, టవల్‌కు రూ.48, దుప్పటికి రూ.343 వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది అటెండెంట్లు తమ అనుభవాన్ని వివరిస్తూ.. నెలకు సుమారు రూ.20,000–25,000 వరకు వేతనం వచ్చినప్పటికీ, ప్రతి నెల లినెన్ వస్తువులు పోయిన కారణంగా రూ.2,000 నుంచి రూ.3,000 వరకు జీతంలో కోత పడుతోందని తెలిపారు. మరికొందరు కాంట్రాక్టర్ల వద్ద వాస్తవ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో బెడ్‌షీట్‌కు రూ.360, టవల్‌కు రూ.150, దుప్పటికి రూ.600 వరకు వసూలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

అయితే, ఈ వసూళ్ల విధానంపై భారతీయ రైల్వే అధికారికంగా దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఏకరీతి నిబంధనను ప్రకటించలేదు. ఈ వివరాలు ప్రధానంగా అటెండెంట్ల వాంగ్మూలాలు, మీడియా కథనాల ఆధారంగా వెలుగులోకి వచ్చాయి. రైల్వే ఆస్తులను సంరక్షించడం ప్రతి ప్రయాణికుడి బాధ్యత. ప్రయాణం ముగిసిన తర్వాత బెడ్‌రోల్‌లోని అన్ని వస్తువులను తిరిగి అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఆస్తి రక్షించబడటమే కాకుండా, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న అటెండెంట్లపై పడే ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us