మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో బయటపడ్డ షాకింగ్ నిజం!
ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరించే అరుదైన పక్షులకు మానవ జోక్యం, శబ్ద కాలుష్యం పెద్ద శాపంగా మారుతోంది. హిమాలయ ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన హిమాలయన్ మోనాల్ పక్షి తన గొంతుకను, కూసే విధానాన్ని మార్చుకుంటున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర అధికారిక పక్షిగా, నేపాల్ జాతీయ పక్షిగా గుర్తింపు పొందిన ఈ పక్షి తీవ్రమైన మానవ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అసలేం జరిగింది..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..

ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి, నేపాల్ జాతీయ పక్షి అయిన అత్యంత అందమైన హిమాలయన్ మోనాల్ తీవ్రమైన ప్రమాదంలో పడింది. ఉత్తరాఖండ్‌లోని హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్ రాజీవ్ లోచన్, దినేష్ కుమార్ శర్మ, ఆనంద్ కుమార్ బృందం చేసిన రెండు వేర్వేరు అధ్యయనాలు ఈ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాయి. రద్దీగా ఉండే లోయలలో పర్యాటక వాహనాల శబ్దాలు, మైక్‌ల హోరు, మానవ సంచారం ఎక్కువ కావడంతో మోనాల్ పక్షులు తమ సహజమైన కూతను వినిపించలేకపోతున్నాయి. దాంతో, ఈ సందడిని దాటుకుని తమ పిలుపులు స్పష్టంగా వినబడేందుకు ఇవి అధిక పౌనఃపున్యం, ఎక్కువ నిడివితో కూయటం ప్రారంభించాయి.
అల్పైన్ గడ్డి మైదానాలు, పర్వత లోయలలో టూరిజం, రోడ్ల నిర్మాణం పెరగడంతో, ఈ పక్షులు తమ సహజ సిద్ధమైన నివాసాలను వదిలి హిమాలయాలలో ఇంకా ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవడానికి బలవంతం చేయబడుతున్నాయి. మోనాల్ పక్షులలో నెమలిలాంటి మెరిసే పచ్చని, నీలి రంగు ఈకలు ఉండి ఎంతో అందంగా ఉంటాయి. ఇవి తమ భాగస్వామిని ఆకర్షించడానికి, తమ సరిహద్దు ప్రాంతాన్ని ప్రకటించడానికి, ఇతర పక్షులకు సమాచారం అందించడానికి కూతలను ప్రధానంగా ఉపయోగిస్తాయి. శబ్ద కాలుష్యం వల్ల వీటి కమ్యూనికేషన్ దెబ్బతిని జతకట్టడం, సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
శాస్త్రవేత్తల హెచ్చరిక:
హిమాలయాల్లో కేవలం చెట్లు, నదులు దెబ్బతినడమే కాకుండా, కంటికి కనిపించని శబ్ద వాతావరణం కూడా వేగంగా కలుషితమవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో హిమాలయన్ మోనాల్ పక్షుల ఉనికికే పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
