మనుషులకు కుక్కలకు ఉన్న బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది కొన్ని సంఘటనలు గురించి విన్నా.. చదివినా.. కుక్కలు అత్యంత విశ్వాసం గల జంతువు. తమ యజమాని కోసం ఎంతటి త్యాగానికైనా వెరవదు అని అనేక మార్లు నిరూపించాయి. తాజాగా కుక్కకు యజమాని పట్ల విశ్వాసానికి గుర్తుగా నిలిచింది ఓ సంఘటన. అమెరికాలోని ఒరెగాన్‌లో జరిగిన ఓ సంఘటన నిజంగా కుక్కకు ఉన్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. జూన్ 2నవ తేదీన 62 ఏళ్ల బ్రాండన్ గారెట్ తన నాలుగు కుక్కలతో అడవుల్లో విహరించడానికి బయలుదేరాడు. దురదృష్టవశాత్తు బ్రాండన్ గారెట్ కారు అదుపుతప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదం తర్వాత గారెట్ కుక్క బ్లూ దాదాపు 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గారెట్ కుటుంబం ఉంటున్న క్యాంప్‌సైట్‌కు పరిగెత్తుకుని వెళ్ళింది.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం క్యాంప్‌సైట్‌లో ఒంటరిగా ఉన్న బ్లూని చూసిన తర్వాత కుటుంబం, స్నేహితులు ఏదో జరగరాని సంఘటన జరిగిందని అనుమానించారు. దీని తరువాత అందరూ బ్లూని అనుసరించి బ్రాండన్ కారు ప్రమాదానికి గురైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ బ్రాండన్ గారెట్ పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు 911కు ఫోన్ చేసి రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు.
అయితే.. రాత్రంతా కురిసిన వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ చాలా సవాలుగా మారింది. బ్రాండన్ సోదరుడు టైరీ తన సోదరుడు బతికే ఉన్నాడా లేదా అని భయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం, టైరీ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి తన సోదరుడిని బ్రాండన్ గారెట్ అంటూ పిలిచాడు. అయితే బ్రాండన్ గారెట్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. తమ్ముడిలో భయాందోళన పెరిగింది.
అయితే రెస్క్యు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. బ్రాండన్ కు తగిలిన తీవ్ర గాయాల కారణంగా అతను కందకం నుండి బయటపడలేకపోయాడు. సహాయం కోసం, తన నమ్మకమైన కుక్క బ్లూని అర్ధించాడు. యజమాని పరిస్థితిని గమనించిన బ్రాండన్ బ్లూ యజమాని ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళింది. తన కుక్క బ్లూ తిరిగి వచ్చే వరకూ రాత్రంతా ఆ గుంటలో గడిపాడు. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయి కందకంలో ఉన్న బ్రాండన్ తాడుతో కట్టి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. కుక్క తెలివితో బ్రాండన్ ప్రాణాలతో బయటపడ్డాడు.
తన యజమానిని రక్షించే సమయంలో బ్రాండన్ కుక్క బ్లూ కూడా గాయపడింది. పెట్ డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లి చికిత్స అందించారు. కుక్కలు విశ్వాసపాత్రంగా ఉండటమే కాకుండా తమ యజమానులను ఇబ్బందుల నుంచి కాపాడేందుకు ఎంతకైనా తెగించగలవని ఈ సంఘటన రుజువు చేస్తోంది. బ్లూ తెలివి మనిషిలా అలోచించి తీసుకున్న నిర్ణయం తన యజమాని ప్రాణాలను కాపాడింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..