సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిని నెటిజన్లు భలేగా ఇష్టపడతారు. అంతే ఇంకేముంది క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే అడవిలో జంతువులు చేసే చిత్ర, విచిత్ర విన్యాసాలకు, వేటకు హద్దు ఉండదు. అందుకేనేమో వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదిస్తాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అడవికి రారాజు సింహం. సింహం వేట ఎంత సాలిడ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గర్జన వినిపిస్తే చాలు మిగతా జంతువులు పారిపోతాయి. మృగరాజు అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇక సింహం పంజా పవర్ ఎలాంటిదో చూపించేలా పలు వీడియోలు నెట్టింట చూశాం. అయితే అంతటి బలశాలి కూడా కొన్నిసార్లు తడబడవచ్చు. ఓ గేదెను వేటాడబోయి సింహం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
నది ఒడ్డున సేద తీరుతూ నీళ్లు తాగుతున్న ఓ గేదెను రెండు సింహాలు గమనించాయి. అదును చూసుకుని దాన్ని వేటాడాయి. అయితే ఇక్కడే అసలు చిక్కు ఇప్పుడొచ్చి పడింది. తన స్నేహితుడిని కాపాడుకోవడానికి వందల్లో గేదెలు ఆ నది ఒడ్డుకు చేరుకున్నాయి. ఒక సింహం ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకున్నా.. మరొకటి వాటి మధ్య ఇరుక్కుపోయింది.
అంతే ఆ 100కి పైగా వచ్చిన గేదెలు వాటి కొమ్ములతో సింహాన్ని పొడుస్తూ గాల్లో గింగిరాలు తిప్పుతూ కాళ్ల కింద తొక్కి చంపేశాయి. ఈ దృశ్యాలను సందర్శనకు వచ్చిన పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియో మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది.