‘8లో 6 పనిచేయడం లేదు’.. విమానంలో టాయిలెట్ల సమస్య.. మధ్యలో దారి మళ్లించిన పైలట్!
విమాన ప్రయాణంలో చిన్న సమస్య ఎదురైనా కొన్నిసార్లు ప్రయాణికులకు పెద్ద ఇబ్బందే ఎదురవుతుంది. తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ అంతర్జాతీయ విమానంలో ఇదే జరిగింది. విమానంలో మొత్తం 8 టాయిలెట్లు ఉండగా.. ఏకంగా 6 పనిచేయకుండా పోయాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పైలట్ విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా మధ్యలోనే దారి మళ్లించాడు.

అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ నంబర్ 37 అక్టోబర్ 6న స్పెయిన్‌లోని మాడ్రిడ్ నుంచి అమెరికాలోని డల్లాస్-ఫోర్ట్ వర్త్ కి బయలుదేరింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానంలోని టాయిలెట్లలో సమస్య తలెత్తింది. విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది టాయిలెట్లలో ఆరు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో కేవలం రెండు టాయిలెట్లు మాత్రమే అందుబాటులో మిగిలాయి. సుదీర్ఘ అంతర్జాతీయ ప్రయాణంలో ఇంత తక్కువ సంఖ్యలో టాయిలెట్లు అందుబాటులో ఉండటం ప్రయాణికులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉండటంతో పైలట్ విమానాన్ని దారి మళ్లించాలని నిర్ణయించుకున్నాడు.
‘కేవలం రెండు టాయిలెట్లేనా?’ ఏటీసీ ప్రశ్న
విమానం దారి మళ్లించేందుకు అనుమతి కోరిన సమయంలో పైలట్‌కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. విమానం ఎందుకు దారి మళ్లించాల్సి వచ్చిందని కంట్రోలర్ ప్రశ్నించగా.. విమానంలో కేవలం రెండు టాయిలెట్లు మాత్రమే పనిచేస్తున్నాయని పైలట్ వివరించాడు. దీంతో కంట్రోలర్.. ‘మీరు చెప్పింది కేవలం రెండు టాయిలెట్లు మాత్రమే పనిచేస్తున్నాయనా?’ అని నిర్ధారించుకున్నాడు. అందుకు పైలట్ ‘అవును.. అదే నిజం’ అని సమాధానమిచ్చాడు. టాయిలెట్ల సమస్య కారణంగా విమానాన్ని న్యూయార్క్‌లోని జెఎఫ్ కే విమానాశ్రయం వైపు మళ్లించారు. అక్కడ విమానం ల్యాండ్ అయిన తర్వాత సాంకేతిక నిపుణులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం విమానం తిరిగి డల్లాస్-ఫోర్ట్ వర్త్‌కు బయలుదేరింది.
టాయిలెట్ల సమస్య చిన్నదేనా?
విమానంలో ఆరు టాయిలెట్లు పనిచేయకపోవడం సాధారణ సమస్యలా కనిపించినప్పటికీ.. సుదీర్ఘ అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇది భద్రతాపరమైన ఇబ్బందులకు దారితీస్తుంది. టాయిలెట్ల కోసం ప్రయాణికులు ఎక్కువసేపు క్యూలో నిలబడాల్సిన పరిస్థితుల్లో సీట్‌బెల్ట్ సంకేతం వెలిగితే ప్రయాణికులు తమ సీట్లకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితితో విమానంలో భద్రతా సమస్య తలెత్తే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానం కావడంతో మరమ్మత్తుల కోసం విమానాన్ని కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సదుపాయాలున్న విమానాశ్రయానికి మళ్లించడం మంచిదనీ.. న్యూయార్క్‌లోని JFKతో పాటు నెవార్క్, ఫిలడెల్ఫియా, బోస్టన్ విమానాశ్రయాలు ఇందుకు అనుకూలమని పైలట్ భావించాడు. టాయిలెట్లు పనిచేయకపోవడంతో ఓ అంతర్జాతీయ ప్రయాణం మధ్యలోనే దారి మళ్లింది. పైకి చిన్న సమస్యగా కనిపించినా.. ప్రయాణికుల సౌకర్యం, భద్రత, విమాన నిర్వహణ విషయంలో ఇలాంటి సమస్యలను విమానయాన సంస్థలు ఎందుకు సీరియస్‌గా తీసుకుంటాయో ఈ ఘటన తెలిపింది.