Shubhanshu Shukla: ‘కుపోలా’ నుంచి వీక్షణం.. అద్భుతం.. ఆ దృశ్యం అనిర్వచనీయం

ఏదన్నా ఎత్తైన భవనంపైకెక్కి చుట్టూ చూస్తేనే కనుచూపుమేరలో అంతా కనిపిస్తోందని మురిసిపోతాం. అలాంటిది అంతరిక్షంలోకి భూమి మీదికి తొంగిచూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం కదూ. మాటలకందని అనుభూతి కదూ. ఎస్‌.. అందరికీ దక్కదు ఈ అవకాశం. కఠోర శిక్షణల తర్వాత ఏ కొందరికో దక్కుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాకే ఈ భూగోళాన్ని కిటికీలోంచి చూసే భాగ్యం కలుగుతుంది.

Shubhanshu Shukla: కుపోలా నుంచి వీక్షణం..  అద్భుతం.. ఆ దృశ్యం అనిర్వచనీయం
Shubhanshu Shukla At Cupola

Updated on: Jul 07, 2025 | 1:52 PM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ కిటికీ తెరిస్తే విశ్వమంతా కళ్లముందుంటుంది. దానిపేరే కుపోలా. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమర్చిన కిటికీ అది. కుపోలా కిటికీనుంచి ప్రపంచాన్ని చూసి వ్యోమగాములు పొందే అనుభూతి మాటల్లో చెప్పలేం.

ఎప్పుడో 35ఏళ్ల క్రితమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని మొదలుపెట్టినా.. 2010లో డిస్కవరీ స్పేస్‌ షెటిల్‌ సాయంతో ట్రాంక్విలిటీ మాడ్యూల్‌ని ISSకి చేర్చారు. దీంతోపాటు ఏడు అద్దాల కిటీకీలతో ఉన్న గాజు గదిలాంటి కుపోలాని కూడా పంపించారు. 2.95 మీటర్ల చుట్టుకొలత.. ఒకటిన్నర మీటర్ల ఎత్తుతో ఉండే ఈ గాజు గది బరువు 1,880 కిలోలు. అతిపెద్దదైన గ్లాస్‌ విండో వృత్తాకారంలో 80 సెంటీమీటర్లుంటుంది.

కుపోలా ISSకి చేరకముందే వ్యోమగాములు భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు గాజు గదిలోకి ప్రవేశిస్తే ప్రపంచమే కళ్లముందుంటుంది. అంతరిక్ష శకలాలు, ఉల్కలు తగిలి గీతలు పడకుండా కుపోలా అద్దాలకు ప్రత్యేక షట్టర్లుంటాయి. అవసరమైనప్పుడే వాటిని తెరుస్తారు. స్పేస్‌ స్టేషన్‌ బయటెలా ఉందో దీని ద్వారా నేరుగా వీక్షించే అవకాశం ఉంది. వ్యోమగాములు ఇందులోంచే పుడమితో పాటు అంతరిక్ష అందాలను ఏకకాలంలో వీక్షిస్తుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.. ఇక్కడ ప్రయోగాలు నిర్వహించిన సందర్భంగా తీసిన చిత్రాలు వైరల్‌గా మారాయి.