
అంగరంగ వైభవంగా వివాహం జరిపించామని చెప్పడం విన్నాం..! వచ్చినవాళ్లందరికీ సాదరంగా మర్యాదలు చేసి, కడుపు నిండా పెళ్లి భోజనం పెట్టడం చూశాం..! ఎన్నోసార్లు మనం కూడా వెళ్లే ఉంటాం. మరి జీవితంలో మర్చిపోలేని విధంగా, అసలు ఊహకు కూడా అందని విధంగా జరిగే పెళ్లిళ్లు ఎప్పుడో అప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పెళ్లి కూడా. అదెలా అంటే.. ఆ పెళ్లికి మేనమామలు ఇచ్చిన కట్నకానుకలే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.. మరి ఇది అట్లాంటి ఇట్లాంటి పెళ్లి అనుకుంటున్నారా ఏంటి..!
రాజస్థాన్ రాష్ట్రం బీకానేర్ జిల్లాలో జరిగిన ఓ రెండు పెళ్లిళ్ల గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ. పెళ్లిలో పెట్టిన మైరా ఇప్పుడు రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాలోని నోఖా పట్టణంలో గిరధారి గోదారా, జగదీశ్ గోదారా అనే యువకులకు తమ వివాహ సందర్భంగా వారి మేనమామలు ఇచ్చిన మైరా ఆ స్థాయిలో చెప్పుకునేలా ఉంది. మైరా అంటే వధువు లేదా వరుడి మామ తన సోదరి కుటుంబానికి బహుమతులు, డబ్బు, బట్టలు ఇచ్చి వివాహాన్ని జరుపుకునే హిందూ వివాహ ఆచారం. ఈ వేడుకలో, మేనమామ కుటుంబం.. వధువు, వరుడికి వారి కుటుంబానికి బహుమతులు ఇస్తారు. ఇది వారి ప్రేమను వ్యక్తపరిచే ఒక ఆచారంగా పాటిస్తారు. ఇది ప్రధానంగా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తమ మేనల్లుడి వివాహం కోసం సీనియాలా గ్రామానికి చెందిన భన్వర్, జగదీశ్ లేఘా సోదరులు భారీ మైరా ఇచ్చారు.
అయితే.. పెళ్లిళ్లల్లో సాంప్రదాయంగా డబ్బు, బంగారం, వెండి, బట్టలు ఇచ్చే మైరా ఆచారం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఇదే ఆచారాన్ని ఈ లేఘా సోదరులు సరికొత్త రీతిలో పాటించి ఒక కొత్త రికార్డును నెలకొల్పారు. ఈ మేనమామలు ఇచ్చిన మైరా ప్రకారం.. మొత్తం రూ.1 కోటి 11 లక్షల నగదుతో పాటు సుమారు ఒక కిలో 250 గ్రాముల వెండి, 31 తులాల బంగారం అందించారు. దీని మొత్తం విలువ కలిపి సుమారు రూ.45 లక్షలు అవుతుందని అంచనా. అంటే నగదు, బంగారం, వెండితో కలిపి మొత్తం రూ.1.56 కోట్లు విలువైన మైరా ఇచ్చినట్లు సమాచారం. ఇది స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కార్యక్రమానికి నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ హాజరయ్యారు. జేపీ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులైన భన్వర్, జగదీశ్ లేఘా సోదరులు ఇది తమ కుటుంబంలో తొలి మైరా అని, అందుకే తమ అక్క పిల్లల పెళ్లికి ఇంత పెద్దమొత్తంలో మైరా సమర్పించామని చెప్పడం గమనార్హం..!
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..