సొంతం తమ్ముడి పెళ్లికి లీవ్‌ ఇవ్వని బాస్‌..! ఆ ఉద్యోగి ఏం చేశాడో తెలుసా..?

ఒక ఉద్యోగి తన సోదరుని వివాహానికి సెలవు అభ్యర్థనను యజమాని తిరస్కరించడంతో రాజీనామా చేశాడు. ఈ సంఘటన రెడ్డిట్‌లో వైరల్‌ అయింది. యజమాని, అతనికి అనుభవ ప్రమాణపత్రం ఇవ్వకుండా వేధిస్తున్నాడు. ఉద్యోగి నాలుగు సంవత్సరాలుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని నిర్ణయానికి సోషల్ మీడియాలో విస్తృత మద్దతు లభిస్తోంది.

సొంతం తమ్ముడి పెళ్లికి లీవ్‌ ఇవ్వని బాస్‌..! ఆ ఉద్యోగి ఏం చేశాడో తెలుసా..?
Representative Image

Updated on: Sep 11, 2025 | 5:16 PM

ఈ మధ్య కాలంలో ఉద్యోగులకు, వారి బాస్‌లకు మధ్య జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పని విషయంలోనో, పని ఒత్తిడి విషయంలోనో లేదా సెలవుల విషయంలో కావొచ్చు.. ఉద్యోగి, యాజమాని మధ్య నిప్పు రాజుకుంటుంది. కార్పొరేట్‌ కల్చర్‌ వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యోగులు తమకు ఏదైనా విషయం నచ్చకుంటే చాలా వైల్డ్‌ డిసిషన్స్‌ కూడా తీసుకుంటారు. అలాంటి ఓ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక ఉద్యోగి తన సోదరుడి వివాహానికి తన బాస్ నుండి సెలవు అడిగాడు. కానీ బాస్ అతనికి సెలవు ఇవ్వడానికి నిరాకరించడంతో, అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు . అతను ఈ విషయాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నాడు.

r/indianWorkplace అనే రెడ్డిట్ ఖాతాలో తన తమ్ముడి వివాహానికి సెలవు ఇవ్వనందున ఒక ఉద్యోగి రాజీనామా చేశాడు. అతను అలా చేసినందుకు అతని బాస్‌ ఆ ఉద్యోగికి ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్‌ ఇవ్వకుండా వేధిస్తున్నాడు. ఉద్యోగి చేసిన పోస్ట్‌లో.. నేను గత నాలుగు సంవత్సరాలుగా ఒకే కంపెనీలో చాలా పనిచేశాను. ఇది నా మొదటి ఉద్యోగం. నా సొంత సోదరుడి వివాహానికి 15 రోజుల సెలవు కావాలని నేను మూడు నెలల క్రితం అతనికి తెలియజేశాను. కానీ అతను చూద్దాం అని అన్నాడు. ఇప్పుడు పెళ్లికి రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, కానీ అతను నాకు సెలవు ఇవ్వనని చెప్పాడు, కాబట్టి తరువాత ఏమి చేయాలో నాకు తెలియదు. నా నోటీసు పిరియడ్‌ 45 రోజులు, కానీ నేను 15వ తేదీ రాత్రి ప్రయాణించవలసి ఉంది (టిక్కెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి), దాంతో ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదు.

కంపెనీ అర్థం చేసుకుంటుందని ఆశిస్తూ నేను రాజీనామా చేశాను. కానీ వారు నన్ను ఇమెయిల్‌ల ద్వారా బెదిరిస్తున్నారు. నన్ను హింసిస్తున్నారు. నేను కనీసం 2 వారాలు పని చేయకపోతే, వారు నాకు ఎక్స్‌పీరియన్స్‌ లెటర్‌ ఇవ్వరని వారు చెబుతున్నారు. నేను వారి నియమాలను పాటించకపోతే, భవిష్యత్తులో నాకు సమస్యలు సృష్టిస్తారని వారు బెదిరిస్తున్నారని సదరు ఉద్యోగి రెడ్డిట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో యూజర్లు ఆ ఉద్యోగికి మద్దతు తెలుపుతూ.. కంపెనీ తీరుపై మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి