AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి కాబోతున్న గే రిలేషన్లో ఉన్న నెదర్లాండ్స్ ప్రధాని !

స్వలింగ భాగస్వామితో కలిసి జీవిస్తున్న నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ త్వరలో తండ్రి కాబోతున్నారు. జీవిత భాగస్వామి, అర్జెంటీనాకు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్‌తో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం వారు సరోగసీ పద్ధతిని ఎంచుకున్నారు. 2027లో తమ జీవితాల్లోకి చిన్నారి రాబోతున్నట్లు రాబ్ జెట్టెన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

తండ్రి కాబోతున్న గే రిలేషన్లో ఉన్న నెదర్లాండ్స్ ప్రధాని !
Dutch Prime Minister Expecting First Child Through Surrogate Mother
Sharada V
|

Updated on: Oct 22, 2026 | 6:00 PM

Share

స్వలింగ భాగస్వామితో కలిసి జీవిస్తున్న నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ త్వరలో తండ్రి కాబోతున్నారు. జీవిత భాగస్వామి, అర్జెంటీనాకు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్‌తో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం వారు సరోగసీ పద్ధతిని ఎంచుకున్నారు. అండదాత సహకారంతో మరో మహిళ బిడ్డకు జన్మనివ్వనుంది. 2027లో తమ జీవితాల్లోకి చిన్నారి రాబోతున్నట్లు రాబ్ జెట్టెన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

సరోగసీకి సహకరిస్తున్న స్నేహితులు

ఈ బిడ్డ కోసం అండాన్ని అందిస్తున్న మహిళ, సరోగసీ ద్వారా గర్భం దాల్చనున్న మహిళ ఇద్దరూ రాబ్‌, నికోలస్‌ జంటకు స్నేహితులే. వారిద్దరికీ ఇప్పటికే పిల్లలు ఉన్నారు. ఈ సహాయం వెనుక ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేవని, స్నేహపూర్వకంగానే ఈ పనికి ఒప్పుకున్నారనీ పార్టీ తెలిపింది. నెదర్లాండ్స్‌లో సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి మహిళకు డబ్బు చెల్లించడం చట్టవిరుద్ధం. నెదర్లాండ్స్‌ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే వైద్యుల పర్యవేక్షణలో ఐవీఎఫ్‌ (IVF) ద్వారా గర్భధారణ జరిగింది.

తమ జీవితాల్లోకి త్వరలోనే ఓ చిన్నారి రాబోతున్నాడని రాబ్ జెట్టెన్, భాగస్వామి నికోలస్ కీనన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మా జీవితాల్లోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నాడు. చిన్నారి.. 2027లో నిన్ను కలుస్తాం. మా కోసం అండాన్ని దానం చేసిన మహిళకు, సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వనున్న మహిళకు, వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ సహకారం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు’, అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బిడ్డ పుట్టిన తర్వాత కుటుంబంతో గడిపేందుకు ప్రధాని రాబ్ జెట్టెన్ పేరంట్ లీవ్ తీసుకోనున్నారు. అయితే, ఎక్కువ కాలం సెలవు తీసుకునే ఆలోచన ఆయనకు లేదని డీ66 పార్టీ వెల్లడించింది.

ప్రధాని రాబ్ జెట్టెన్‌కు అర్జెంటీనాకు చెందిన అంతర్జాతీయ ఫీల్డ్ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్‌తో 2024 నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది.  2026 వేసవిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ, జెట్టెన్ ప్రధానమంత్రి కావడంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ప్రపంచంలోనే తొలిసారి 2001లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన దేశం నెదర్లాండ్స్. ఇక 2025లో జరిగిన ఎన్నికల్లో జెట్టెన్‌కు చెందిన డీ66 పార్టీ అనూహ్య విజయం సాధించింది. దీంతో 2026 ఫిబ్రవరిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జెట్టెన్.. నెదర్లాండ్స్ చరిత్రలోనే అతి పిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే తండ్రి కాబోతున్న క్షణం కోసం రాబ్‌ జెట్టెన్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us