అదొక గూడ్స్ రైలు. గయాలోని మాన్‌పూర్ నుంచి జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు వెళ్తోంది. మాములుగా గూడ్స్ ట్రైన్ అంటేనే.. ముందు డ్రైవర్.. వెనుక గార్డ్ తప్ప మరెవరు ఉండరు.. బోగీలన్నీ ఖాళీగా ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చేరవేసే గూడ్స్ వాటిల్లో నిండి ఉంటాయి. ఇదిలా ఉంటే.. రైలు మార్గం మధ్యలో ఉండగా డ్రైవర్‌కు ట్రైన్ పైనుంచి భారీగా కేకలు వినిపించాయి. మొదటిగా వాటి గురించి పెద్దగా పట్టించుకోని డ్రైవర్.. తన పని తాను చేసుకుని పోయాడు. ఇక ట్రైన్ ధన్‌బాద్ స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్ చేరుకోగానే అక్కడున్న ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది ట్రైన్‌పైన ఓ వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు.
హై టెన్షన్ వైర్లు తగలకుండా ఆ వ్యక్తిని జాగ్రత్తగా కిందకు దించారు. అతడు తునకుప్ప ప్రాంతానికి చెందినవాడిగా అధికారులు గుర్తించారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి గూడ్స్ ట్రైన్ బోగీపైకి ఎక్కి.. సుమారు 220 కిలోమీటర్లు ప్రయాణించాడు. కాగా, ధన్‌బాద్ స్టేషన్‌లో రైల్వే సిబ్బంది అతడ్ని పైనుంచి కిందకు దింపుతున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు బీహార్‌లో ఓ వ్యక్తి ఇంజిన్ కింద కూర్చుని 190 కిలోమీటర్లు ప్రయాణించిన విషయం విదితమే. లోకో పైలెట్ అతడి ఏడుపులు విని ట్రైన్ ఆపగా.. అసలు విషయం బయటపడింది.