మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..
మనుషులు, జంతువులలో ఆడ, మగ ఉంటారని అందరికీ తెలుసు.. కానీ మన పెరట్లోని మొక్కల్లో కూడా ఆడ, మగ తేడాలు ఉంటాయని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. కొన్ని చెట్లు కేవలం పూలు పూసి ఊరుకుంటే, మరికొన్ని మాత్రమే కాయలు ఎందుకు కాస్తాయి? ఈ వృక్ష ప్రపంచంలో ప్రకృతి దాచిన ఆ అద్భుతమైన ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సృష్టిలో మనుషులు, జంతువులు, పక్షుల్లో స్త్రీ, పురుష భేదాలు సహజం. మరి మన ఇంటి పెరట్లో, పొలాల్లో కనిపించే మొక్కల మాటేమిటి? వాటిలోనూ ఆడ, మగ ఉంటాయా? అంటే.. అవుననే చెబుతోంది వృక్షశాస్త్రం. మొక్కలు మాట్లాడలేకపోవచ్చు, కదల్లేకపోవచ్చు.. కానీ వాటిలోనూ సంతానోత్పత్తికి ఆడ, మగ వ్యవస్థలుంటాయి. పూలు పూయడం, కాయలు కాయడం వెనుక ప్రకృతి అద్భుతమైన లైంగిక వైవిధ్యం దాగి ఉంది. అయితే అన్ని మొక్కల్లోనూ ఈ విధానం ఒకేలా ఉండదు.
ఒకే పువ్వులో ఇద్దరూ
ప్రకృతిలో చాలావరకు మొక్కలకు ఒకే పువ్వులో ఆడ, మగ అవయవాలు రెండూ కలిసి ఉంటాయి. వీటిని వృక్షశాస్త్రంలో సంపూర్ణ పుష్పాలు లేదా ద్విలింగ పుష్పాలు అంటారు.
ఉదాహరణలు: గులాబీ, మందార, టమాటా, వంగ, మిర్చి, బీన్స్.
ఎలా పనిచేస్తాయి?: పువ్వులోని మగ భాగం పసుపు రంగు పుప్పొడిని ఉత్పత్తి చేస్తే, మధ్యలో ఉండే ఆడ భాగం ఆ పుప్పొడిని స్వీకరిస్తుంది. దీని ద్వారా ఆత్మపరాగసంపర్కం జరిగి పిందెలు, కాయలుగా మారతాయి.
ఒకే చెట్టు.. వేర్వేరు పువ్వులు
కొన్ని జాతుల మొక్కలలో అంటే మొక్కజొన్న, గుమ్మడి, దోసకాయ, కొబ్బరి చెట్లకు మగ పువ్వులు వేరుగా, ఆడ పువ్వులు వేరుగా పూస్తాయి. మొక్కజొన్నలో చెట్టు పైభాగంలో ఉండే కంకిలాంటి నిర్మాణం మగ పువ్వు. అది పుప్పొడిని రాలుస్తుంది. కింద కండె భాగంలో పీచుతో ఉండేది ఆడ పువ్వు. గుమ్మడి, బీర, దోస పాదుల్లో మొదట పూసే పూలలో ఎక్కువ శాతం మగ పూలే ఉంటాయి. ఆడ పువ్వు వెనుక భాగంలోనే చిన్నపాటి పిందె ముందే కనిపిస్తుంది. తేనెటీగలు మగ పువ్వు పైనుంచి పుప్పొడిని ఆడ పువ్వుకు చేర్చినప్పుడే ఆ పిందె పెద్ద కాయగా ఎదుగుతుంది.
మొక్కలే వేరు: ఇవి ఆడ చెట్లు.. అవి మగ చెట్లు
ఇది అత్యంత ఆసక్తికరమైన విభాగం. బొప్పాయి, ఖర్జూరం, కివి, తాటి చెట్లలో ఆడ, మగ వేర్వేరుగా ఉంటాయి. అంటే ఒక చెట్టు పూర్తిగా మగ పువ్వులనే పూస్తే, మరొక చెట్టు కేవలం ఆడ పువ్వులనే పూస్తుంది. ఈ జాతి మొక్కల్లో ఆడ చెట్లు మాత్రమే కాయలను కాస్తాయి. మగ చెట్లు కేవలం పుప్పొడిని అందించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. తోటల్లో ఆడ చెట్లు ఉండి, దరిదాపుల్లో ఒక్క మగ చెట్టు కూడా లేకపోతే పరాగసంపర్కం జరగక కాయలు నిలవవు, రాలిపోతాయి. అందుకే బొప్పాయి తోటల్లో ప్రతి 10-15 ఆడ చెట్లకు కనీసం ఒక మగ చెట్టు ఉండేలా రైతులు జాగ్రత్తపడతారు. ఖర్జూర తోటల్లోనైతే రైతులు మగ పూల పుప్పొడిని తీసుకొచ్చి చేతులతోనే ఆడ పూలపై చల్లే కృత్రిమ పరాగసంపర్కం చేస్తారు.
పువ్వు ఆడదా, మగదా అని ఎలా గుర్తించాలి?
ఏ చెట్టుకైనా పూసిన పువ్వును నిశితంగా గమనిస్తే సులువుగా పోల్చుకోవచ్చు.
మగ పువ్వు: పువ్వు మధ్యలో చిన్న కాడల చివర పసుపు రంగు పొడితో కూడిన పరాగకోశాలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటి కాడ కింద ఎలాంటి పిందె ఉండదు.
ఆడ పువ్వు: పువ్వు రేకల కింద చిన్న పిందె ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. పువ్వు మధ్యలో జిగురుగా ఉండే కీలాగ్రం ఉంటుంది.
దిగుబడికి ఈ తేడా తెలియడం ఎందుకు అవసరం?
ఇంటి పెరట్లో లేదా డాబాపై మొక్కలు పెంచేవారు తరచూ పూత బాగా వస్తోంది కానీ కాయలు కాయడం లేదు అని బాధపడుతుంటారు. దానికి కారణం తేనెటీగలు లేక పరాగసంపర్కం జరగకపోవడమే. ఏది ఆడ పువ్వు, ఏది మగ పువ్వు అని గుర్తిస్తే.. చేత్తోనే చిన్న బ్రష్ సాయంతో పుప్పొడిని అద్ది కాయలు కాసేలా చేయవచ్చు. గాలి, కీటకాలు, పక్షుల సాయంతో నిశబ్దంగా సాగే ఈ పరాగసంపర్క క్రియ.. ప్రకృతి విచిత్రమైన సృష్టికి తిరుగులేని నిదర్శనం.
