గత కొద్ది రోజులుగా రైలు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఎక్కడో ఒకచోట రైలు పట్టాలు తప్పనట్టుగా వస్తున్న వార్తలు ప్రయాణికుల్లో భయాందోళనలు పుట్టిస్తున్నాయి. అంతేకాదు..తరచూ ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొన్నాయనే వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. తాజాగా రన్నింగ్‌లో ఉన్న రైలు రెండుగా విడిపోయిన షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ నుంచి ధన్‌బాద్ వెళ్తున్న కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం తెల్లవారుజామున 3.36 గంటల ప్రాంతంలో ధాంపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. 3.45 గంటలకు సర్కడ చక్రజామల్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన అనంతరం రారుపూర్ రైల్వేగేట్ సమీపానికి రాగానే ఒక్కసారిగా ఆ రైలు రెండుగా విడిపోయింది. మొత్తం 21 కోచ్‌లకు గాను ఎనిమిది కోచ్‌లు విడిపోయాయని తెలిసింది. మిగతా రైలు సియోహరా స్టేషన్‌కు చేరుకోగా, రారుపూర్ సమీపంలో ఎనిమిది కోచ్‌లు నిలిచిపోయాయి. ఈ ఘటనపై గార్డ్ సమాచారం అందించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఎస్‌పి ధరమ్ సింగ్, పోలీస్ సర్కిల్ సర్వం కుమార్, కొత్వాల్ కిషన్ అవరాత్ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కోచ్‌లను రైలుకు అనుసంధానించారు. రైలులో ఉన్న ప్రయాణికుల్లో ఎక్కువగా పోలీస్ ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులే ఉన్నారని తెలిసింది.
రైలు రెండుగా విడిపోవటంతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. రైల్వేగేట్ వద్ద అధికారులు రోడ్డు మార్గంలో వచ్చే బస్సులను ఆపి అభ్యర్థులను గమ్యస్థానాలకు పంపారు. ఈ రైలు ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధాంపూర్ రైల్వే స్టేషన్‌లో పంజాబ్ మెయిల్ దాదాపు 2 గంటల పాటు నిలిచిపోయింది. ధాంపూర్‌లో స్టాపే లేని జననాయక్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లపై తీవ్ర ప్రభావంపడింది. అదృష్టవశాత్తు రైలు రెండుగా విడిపోయిన ఘటనతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అదే మార్గంలో మరో రైలు వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..