విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా చూశారా? అందులో బ్రహ్మానందం ఓసారి జాయింట్ వీల్ ఎక్కినప్పుడు వచ్చే సీన్ బాగా గుర్తుంటుంది. జాయింట్ వీల్ స్టార్ట్ కాకముందు అసలు భయమంటే ఏమిటో తెలియనట్లు మాట్లడిన బ్రహ్మీ.. తీరా అది తిరిగాక అరుపులు కేకలు పెడతాడు. ‘ఆపండ్రా బాబోయ్’ అంటూ అంటూ గోల గోల చేసే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. నిజానికి.. అది రియల్ కాకపోయినా బ్రహ్మీ ఏడుపు, భయాన్ని చూసి తెగ నవ్వుకున్నాం. ఇప్పుడు ఆ సీన్ గురించి ఎందుకంటారా? సరిగ్గా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బ్రహ్మానందం లాగానే ఓ చిన్న కుర్రాడు జాయింట్ వీల్ ఎక్కి రచ్చ రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో ఓ మేళాలో 10-12 ఏళ్ల వయసున్న బుడ్డొడు జాయింట్ వీల్ ఎక్కాడు. ఎక్కినప్పుడు ఎంతో హుషారుగా, సంతోషంగానే కనిపించాడు. చిన్నగా కదలడం ప్రారంభమయ్యాక కూడా చప్పట్లు కొట్టి మరీ ఎంజాయ్ చేశాడు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.
దేవుళ్ల పేర్లు తలచుకుంటూ..
జాయింట్ వీల్ వేగం పెరిగే సరికి ఆ కుర్రాడు భయంతో అరవడం మొదలు పెట్టాడు. కేకలు పెట్టాడు. ‘జై మహారాష్ట్ర, హర్ హర్ మహాదేవ్.. జై భజ్‌రంగ్ దళ్’ అంటూ దేవుళ్ల పేర్లు తలచుకున్నాడు. కాపాడండీ.. కాపాడండీ అంటూ కేకలు పెట్టాడు. పాపా, ముమ్మా అంటూ ఇంట్లో వాళ్లను కూడా పిలిచాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుడ్డోడు భయపడినా భలే నవ్వు తెప్పించాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జాయింట్ వీల్ ఎక్కితే పెద్దలే భయపడుతుంటారు. పిల్లలు భయపడడంలో తప్పేముంది అని మరికొందరు స్పందిస్తున్నారు.
Also Read:Russia-Ukraine War: పిసోచెన్‌లో చిక్కుకున్నవారంతా సురక్షితం.. మూడు బస్సుల్లో భారతీయుల తరలింపు