కరోనా వల్ల చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి మళ్లీ రెండేళ్ల తర్వాత తిరిగి ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా కొడాద్‌కాలన్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 2021 జూన్ లో కమలేష్ అనే వ్యక్తి కొవిడ్ బారిన పడటంతో గుజరాత్ లోని బరోడాలో ఓ ఆసుపత్రిలో చేరాడు. అతను చికిత్స తీసుకుంటుండగానే కమలేష్ చనిపోయాడని వైద్యులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం.. కమలేష్ కుటుంబ సభ్యులకు గుడ్డతో కప్పబడి ఉన్న అతని మృతదేహాన్ని దూరం నుంచి చూపించారు. వాళ్లు దగ్గరికి వెళ్లి ఆ మృతదేహాన్ని చూడనప్పటికి వైద్యుల సలహా మేరకు అతను కమలేష్ అని కుటుంబ సభ్యులు అంగీకరించారు. అనంతరం వైద్యులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. చివరికి కమలేష్ చనిపోయాడనే మరణ ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు.
కమలేష్ చనిపోయాడనుకుని అతని నాన్న ఈరోజు వరకు ఆ షాక్ నుంచి కోలుకోలేదు. అతని భార్య దాదాపు 2 సంవత్సరాలు విధవరాలిగా ఉంది. వాస్తవానికి కొవిడ్ బృందం ద్వారా అంత్రయక్రియలు చేయబడిన ఆ మృతదేహాం కమలేష్‌ది కాదు. దాదాపు రెండేళ్ల తర్వాత కమలేష్ మధ్యప్రదేశ్ లో ఉన్న తన మామయ్య ఇంటికి వచ్చాడు.
దీంతో ఒక్కసారిగా తన మామయ్య కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని కమలేష్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేవు. కమలేష్ మామ ఫోన్ లో వీడియో కాల్ చేసి వాళ్లతో మాట్లాడారు.
అయితే కమలేష్ మళ్లీ ఎలా రాగలిగాడనే ప్రశ్న అడగగా.. తాను కరోనా నుంచి కోలుకున్నాక ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని తెలిపాడు. అహ్మదాబాద్ కి తీసుకెళ్లి అక్కడ తనను నిర్భందించి టార్చర్ చేశారని, మత్తు మందు ఇంజెక్షన్లు ఇచ్చేవారని చెప్పాడు. అయితే శుక్రవారం రోజున అహ్మదాబాద్ నుంచి ఆ గ్యాంగ్ తనను కార్లో వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారని..ఓ ప్రాంతంలోని స్నాక్స్ కోసం హోటల్ వద్ద వాహనాన్ని ఆపారన్నాడు. అహ్మదాబాద్ నుంచి ఇండోర్ వరకు వెళ్తు్న్న బస్సును చూసి.. వెంటనే కారు దిగి దాన్ని ఎక్కేశానని తెలిపాడు. ఆ తర్వాత రాత్రికి మధ్యప్రదేశ్ లోని సర్దార్‌పూర్ లో దిగానని..అనంతరం ఇతరులు సహాయంతో తన మామయ్య ఇంటికి వచ్చేశానని చెప్పాడు. ఎట్టకేలకు కమలేష్ ప్రాణాలతో మళ్లీ ఇంటికి రావడంతో అతని కుటుంబ సభ్యులందరు భావోద్వేగానికి గురయ్యారు.