
సైబర్ నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అత్యాశనే పెట్టుబడిగా పెట్టి.. సర్వం కొల్లగొడుతున్నారు కేటు గాళ్లు. తియ్యని మాటలతో నమ్మించి, ఆఫర్లతో కవ్వించి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. తాజాగా పుణెలో ఇలాంటి ఘటనే జరిగింది. వీడియోలకు లైక్ చేస్తే ఒక్కో వీడియోకు రూ.50 సంపాదించవచ్చని ఆశ చూపి.. రూ.12 లక్షలు కాజేశారు సైబర్ నేర గాళ్లు. మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ వ్యక్తి.. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను హింజేవాడిలో నివాసముంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతని ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. వీడియో క్లిప్‌ల లింక్‌లను క్లిక్ చేసి లైక్ చేస్తే ఒక్కో క్లిక్ కు రూ.50 పొందవచ్చని ఆ మెసేజ్ లోని సారాంశం. అంతే కాకుండా బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చేస్తే డైరెక్ట్ గా ఖాతాలోకే డబ్బు జమ అవుతాయని ఉంది.
దీనిని నమ్మిన బాధితుడు.. అందులో చెప్పినట్లే చేశాడు. లింక్‌పై క్లిక్ చేసి స్వయంగా వివరాలు నమోదు చేసుకున్నాడు. దీంతో అతని ఫోన్ కు మూడు క్లిప్‌లు వచ్చాయి. వాటిని లైక్ చేసిన తర్వాత.. బాధితుడి ఖాతాకు నగదు బదిలీ చేశాడు. అనంతరం మరో 14 క్లిప్‌లను లైక్ చేసి, మరింత డబ్బు పొందాడు. అలా రూ.1,000 పెట్టుబడి పెడితే రూ.9,000 వచ్చింది. దీంతో బాధితుడికి ఆశ పెరిగింది. మరింత డబ్బును పెట్టుబడిగా పెడితే.. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని భావించాడు. వెంటనే తనకున్న మరో రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 12.24 లక్షలు బదిలీ చేశాడు.
డబ్బులు వస్తాయని భావించినా.. డబ్బు జమ కాకపోవడంతో వారికి కాల్ చేశాడు. అయితే వారి ఫోన్ కలవలేదు. మోసపోయానని గ్రహించిన వ్యక్తి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..