కిడ్నీ అమ్ముకున్నాడు.. ఐఫోన్ కొన్నాడు.. తీరా ఇప్పుడు బోరుమని ఏడుస్తున్నాడు
ఒక యువకుడి జీవితంలో జరిగిన తప్పు 14 సంవత్సరాల తరువాత కూడా అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ వ్యక్తి తన యవ్వనంలో చేసిన తప్పుకు నేటికీ పరిణామాలను అనుభవిస్తూనే ఉన్నాడు. దాని ఫలితంగా జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. చైనాలో నివసిస్తున్న ఒక వ్యక్తి 17 సంవత్సరాల వయసులో చేసిన తప్పును ప్రజలతో పంచుకున్నాడు. ఇప్పుడు అతను 31 సంవత్సరాల వయసులో ఆ తప్పు పరిణామాలను ఎదుర్కొంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనా నివాసి వాంగ్ షాంగ్కున్ అనే వ్యక్తి కేవలం 17 సంవత్సరాల వయసులో ఇష్టంతో ఒక తప్పు చేశాడు. 2011లో వాంగ్ కు కేవలం 17 ఏళ్ల వయసులో అతను తన కిడ్నీలలో ఒకదాన్ని అక్రమ మార్కెట్లో 20,000 యువాన్లకు (సుమారు రూ. 2.5 లక్షలు) అమ్ముకున్నాడు. అతనికి ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితి లేదు. అయినా కిడ్నీ అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిది అంటే.. అప్పట్లో వాంగ్ లేటెస్ట్ ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కావాలని కోరుకున్నాడు. తన కిడ్నీని అమ్ముకోగా వచ్చిన డబ్బుల ద్వారా అతను ఈ రెండు కోరికలను తీర్చుకున్నాడు. తనకు ఒక కిడ్నీ సరిపోతుందని వాంగ్ భావించాడు. కానీ, తరువాత జరిగింది వాంగ్‌ను శాశ్వతంగా వికలాంగుడిని చేసింది.
ప్రస్తుతం 31 సంవత్సరాల వయస్సులో వాంగ్ పూర్తిగా వికలాంగుడయ్యాడు. అతని రెండవ కిడ్నీ కూడా ఫేయిల్ అయింది. అతను జీవితాంతం డయాలసిస్ యంత్రంపై ఆధారపడవలసి వచ్చింది. ఐఫోన్ 17 ప్రో ధరల పెరుగుదల కారణంగా చాలా మంది యువకులు మళ్ళీ అదే తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో వాంగ్ కథ మళ్లీ వైరల్ అయింది. వాస్తవానికి, ఐఫోన్ తాజా మోడల్ విడుదలైనప్పటి నుండి చాలా మంది యువకులు మానవ శరీర అవయవ అక్రమ రవాణాలో పాల్గొన్న ముఠాలను సంప్రదించారు. చాలా మంది యువకులు తమ కిడ్నీలను అమ్మడం ద్వారా ఐఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. వాంగ్ కథ బహుశా అలాంటివారికి మేలుకోలుపు కావాలని చాలా మంది నెటిజన్లు అంటున్నారు.
తన తప్పును పంచుకుంటూ వాంగ్ 2011 నాటి చీకటి రాత్రిని గుర్తుచేసుకున్నాడు. పేద కుటుంబానికి చెందిన వాంగ్ అనే బాలుడు ఆన్‌లైన్ చాట్ రూమ్‌లో అవయవ అక్రమ రవాణాదారుడి మెసేజ్ చూసి మోసపోయానని చెప్పుకొచ్చాడు. ఆ అక్రమ రవాణాదారుడు ఒక కిడ్నీని అమ్మితే మీకు 250,000 రూపాయలు లభిస్తాయి అనే ఆఫర్ ఇచ్చాడు. అది చూసిన వాంగ్ ఆశపడ్డాడు. రెండు కిడ్నీలు ఉన్నాయి కదా..ఒకటి సరిపోతుంది అనుకున్నాడు. ఆ వెంటనే హునాన్ ప్రావిన్స్‌లోని ఒక చిన్న పట్టణానికి వెళ్లాడు. అక్కడ స్థానిక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత వారు వాంగ్ కు ఎటువంటి ఆరోగ్య సంరక్షణ కల్పించలేదు. కేవలం కిడ్నీని తొలగించారు. డబ్బుతో, వాంగ్ ఆపిల్ గాడ్జెట్‌లతో మెరుస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు.
కానీ, అతని ఆనందం ఎక్కువ కాలం నిలువ లేదు. కొన్ని నెలల్లోనే అతని మరో కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చింది. అపరిశుభ్రమైన శస్త్రచికిత్స కారణంగా బ్యాక్టీరియా వ్యాపించిందని వైద్యులు చెప్పారు. వాంగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి 25శాతం కిడ్నీ పనితీరు మాత్రమే బాగుందని డాక్టర్లు నిర్ధారించారు. తాను చేసిన తప్పు వల్ల వాంగ్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నానని తెలుసుకుని పశ్చాతపడ్డాడు. కానీ ఇప్పుడు అతను ఇతరులలో అవగాహన పెంచుతున్నాడు. చాలా మంది యువకులు ఇప్పటికీ ఇలాంటి తప్పులు చేస్తున్నారు. వాంగ్ తన కథ ద్వారా అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. తద్వారా అతను చేసినట్లుగా మరెవరూ తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని కోరుతున్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




