Video: పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు! భయంతో వణికిపోతున్న గ్రామస్థులు
చైనాలో భారీ వరదల కారణంగా ఒక పాముల పెంపక కేంద్రం ధ్వంసం కావడంతో సుమారు 900 పాములు తప్పించుకున్నాయి. ఇది స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. వరదల్లో 20 మందికి పైగా మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. అధికారులు తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సాధారణంగా ఒక పాము కనిపిస్తేనే భయంతో పరుగులు తీస్తాం. మనం ఉండే ప్రాంతంలో పాము తిరుగుతుంది అని ఎవరైనా చెప్తే చాలు.. అది ఎటు నుంచి వచ్చి కాటేస్తుందో అని టెన్షన్‌తో చచ్చిపోతాం. అలాంటిది ఏకంగా 900 పాములు ఊర్లో తిరుగుతున్నాయి అంటే ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో. తాజాగా చైనాలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. చైనాలో భారీ వరదల కారణంగా ఓ పాముల పెంపకం కేంద్ర పూర్తిగా నాశనం అయింది. దీంతో అందులో పెరుగుతున్న900 పాములు వరదల్లో కొట్టుకొని పోయి అక్కడి నుంచి తప్పించుకున్నాయి.
ప్రస్తుతం చైనాను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 331 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న తీవ్ర వాతావరణ పరిస్థితులు భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీశాయి. వరదల కారణంగా రహదారులు, ఇళ్లు, వ్యవసాయ భూములు నీటమునిగిపోయాయి. సహాయక బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికీ, పలు ప్రాంతాల్లో వరద నీటి ఉద్ధృతి కారణంగా సహాయక కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
వీడియో చూడండి
View this post on Instagram
ఇదిలా ఉండగా వరదలతో మరో ఆందోళనకర పరిణామం చోటుచేసుకుంది. ఉప్పొంగిన వరద నీటికి ఒక వ్యవసాయ క్షేత్రంలోని పాముల పెంపక కేంద్రం దెబ్బతినడంతో అక్కడి నుంచి సుమారు 900 పాములు బయటకు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాములను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వరదల నేపథ్యంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అత్యవసర సమీక్ష నిర్వహించి, ప్రాణనష్టం మరింత పెరగకుండా అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అత్యవసర హెచ్చరికలను పాటించాలని, అవసరం లేకుండా బయటకు రావద్దని సూచిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
