VIRAL VIDEO : కర్ణాటకలోని 66వ నెంబర్ జాతీయ రహదారిపై అంబులెన్స్‌కి దారివ్వని కారు డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యానిమేషన్ పరిశ్రమలో పనిచేసే చరణ్ (31) గా గుర్తించారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. దీని వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనికి శిక్ష వేయాలని కోరుతున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో అంబులెన్స్‌లో ఒక రోగిని కనచుర్ హాస్పిటల్ నుంచి మంగళూరుకు తీసుకెళ్తుండగా ఒక కారు అంబులెన్స్ మార్గాన్ని అడ్డుకున్నట్లు గుర్తించారు. ఈ సంఘటనను కొంతమంది మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన మంగళూరు ట్రాఫిక్ సౌత్ పోలీస్ స్టేషన్ అధికారి మోటారు వాహనాల చట్టం 1988 లోని 194 (ఇ) కింద సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా మంగళూరు నగర పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. వీడియో క్లిప్పింగ్‌లు చూసిన తరువాత డ్రైవర్ అత్యవసర వాహనమైన అంబులెన్స్‌కి దారి ఇవ్వడం లేదని గమనించామన్నారు. అంతేకాకుండా అతడు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్నాడని గుర్తించామన్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా చరణ్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనపై అతడిని విచారించగా తప్పు ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే నిందితుడు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకున్నాడ లేదా అని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ప్రాణాలను కాపాడే అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు సైడ్ ఇవ్వాలని ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు. లేదంటే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Mangaluru police arrested a person and seized a vehicle for obstructing an ambulance on the road. Police commissioner N Shashi Kumar appealed to everyone to always allow the right of way to Ambulances and Emergency vehicles as they are rushing to save lives. @IndianExpress pic.twitter.com/GaXU5xYniT
— Express Bengaluru (@IEBengaluru) July 20, 2021