
ముంబై విమానాశ్రయంలో బాంబ్ అలర్ట్ కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు.. ఇండిగో ఫ్లైట్ 6E-5188 చెన్నై నుంచి ముంబైకి వస్తోంది. విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా, టాయిలెట్‌లో టిష్యూ పేపర్ దొరికిందని, దానిపై విమానంలో బాంబు ఉందని రాసి ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానం టాయిలెట్‌లోని టిష్యూ పేపర్‌పై నా బ్యాగ్‌లో బాంబు ఉందంటూ సందేశం రాసి ఉంది. అంతే కాకుండా ముంబైలోని ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయితే మనమందరం ప్రాణాలు కోల్పోతాం, నేను ఉగ్రవాద సంస్థకు చెందినవాడిని అంటూ మెసేజ్ కూడా రాసింది. ఈ బెదిరింపు సందేశం విమానంలో కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలకు సందేశం గురించి సమాచారం అందించారు. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరినీ హుటాహుటినా కిందకు దింపేశారు సిబ్బంది. అయితే విమానంలో విస్తృతంగా గాలించగా, ఎలాంటి ప్రమాదకర వస్తువు దొరకలేదని చెప్పారు.. ముంబై ఎయిర్‌పోర్ట్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.
గత ఏడాది (2023) నవంబర్ నెలలో ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దుండగుడు డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపించారు. అంతే కాకుండా గతేడాది ఢిల్లీ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..