నేడు ఢిల్లీకి వెళ్లనున్న బండి సంజయ్.. అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశంపైనే..!

|

Dec 06, 2020 | 9:37 AM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నేడు హస్తినాకు వెళ్లనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ ఎన్నికల ఫలితాల్లో..

నేడు ఢిల్లీకి వెళ్లనున్న బండి సంజయ్.. అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశంపైనే..!
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నేడు హస్తినాకు వెళ్లనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాను బండి సంజయ్ కలవనున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వివరాలను పార్టీ అగ్రనేతలకు వివరించనున్నారు. అలాగే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర పెద్దలు సంజయ్‌కు పలు సలహాలు, సూచనలు చేయనున్నట్లు సమాచారం. వీరితో భేటీ అనంతరం సంజయ్.. కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మృతీ ఇరానీలు సహా పలువురు నేతలను కలుస్తారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపనున్నారు. కాగా, గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా స్పందించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూనే.. బండి సంజయ్‌, బీజేపీ శ్రేణుల పనితీరుపై ప్రశంసలు గుప్పించారు.

ఇదిలాఉండగా, గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని బీట్ చేస్తూ బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 48 డివిజన్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ 48 మంది కార్పొరేటర్లతో కలిసి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు చార్మినార్‌లో గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.