Angry Ola customer ties scooter to donkey: ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రత తదితర అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోతుండటం, బ్యాటరీల నుంచి మంటలు వస్తున్న లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతోపాటు ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోగా.. మరికొందరు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే.. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric scooter) స్కూటర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసినా.. కంపెనీ సరిగ్గా స్పందించలేదన్న కారణంతో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. స్కూటర్‌ను గాడిదకు కట్టేసి ఊరేగించాడు. ఈ ఘటన సోమవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లి పట్టణంలో జరిగింది.
పర్లికి చెందిన సచిన్ గిట్టే ఆ స్కూటర్‌ను గాడిదకు కట్టేసి సోమవారం ఊరంతా ఊరేగించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ఈ సందర్భంగా సచిన్ కంపెనీని నమ్మొద్దంటూ ప్లకార్డులను సైతం ప్రదర్శించాడు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ఆరు రోజుల నుంచి పనిచేయడం లేదని సచిన్ పేర్కొన్నాడు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఓలా కంపెనీ స్పందించడం లేదన్నాడు. అందువల్ల తన ద్విచక్ర వాహనాన్ని గాడిదకు కట్టి.. ఆ సంస్థను నమ్మవద్దంటూ ఊరేగించానని తెలిపాడు.
వైరల్ వీడియో..
మహారాష్ట్రలోని పర్లికి చెందిన గిట్టే అనే వ్యాపారి 2021 సెప్టెంబర్‌లో స్కూటర్‌ను బుక్ చేయగా.. మార్చి 24న డెలవరీ అయింది. కాగా.. ఆరు రోజులకే చెడిపోవడంతో కంపెనీని సంప్రదించాడు. ఓలా మెకానిక్ తనిఖీ చేసిన కూడా పనిచేయడం లేదని.. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదని గిట్టే తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: