ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ముందుకు ఓ వింతకేసు వచ్చింది. పదహారేళ్ల బాలుడిని తన వద్దే ఉండేలా అనుమతించాలంటూ ఇటు తల్లి కోర్టు మెట్లు ఎక్కింది. అటు భార్య కూడా భర్తను తన వద్దే ఉండేలా చూడాలని వేడుకుంది. మైనర్ వివాహం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు కాబట్టి, తల్లి వెంట వెళ్లమని సూచించగా బాలుడు అందుకు నిరాకరించాడు. భార్యతోనే ఉంటానని మొండికేశాడు. ఈ కోరిక మన్నిద్దామంటే.. ఓ మైనర్ బాలుడు మేజర్ యువతితో సహజీవనం చేస్తే పోక్సో చట్టం ప్రకారం నేరం అవుతుంది. ఈ విచిత్ర పరిస్థితికి ఓ పరిష్కారం చూపుతూ బాలుడికి మైనారిటీ తీరేదాకా అంటే.. 2022 ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్ హోంకు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మైనార్టీ తీరాక అతడు అతని ఇష్టప్రకారం ఎవరితోనైనా ఉండవచ్చని పేర్కొన్నారు.
ఆజంగఢ్‌కు చెందిన బాలుడి తల్లి దాఖలు చేసిన పిటిషనుపై విచారణ జరిపిన జస్టిస్ జేజే మునీర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది సెప్టెంబర్ 18న ఈ కేసు కోర్టుకు రాగా, జడ్జి అభిప్రాయం రికార్డు చేశారు. మే 31న తుది తీర్పు వెలువరించగా.. రెండు వారాల అనంతరం కోర్టు వెబ్‌సైటులో పెట్టారు. ఇక కొసమెరుపు ఏంటంటే.. మేజర్ యువతితో బాలుడి సాంగత్యం కారణంగా వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు.
Also Read: చిత్తూరు జిల్లాలో దారుణ పరిస్థితులు.. రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా ‘ఏ’ గ్రేడ్ మామిడి పండ్లు