
Fake AI Cheque: ఓ వ్యక్తి చాట్‌జీపీటి 2.0 టూల్‌ను ఉపయోగించి రూ.69వేల నకిలీ బ్యాంక్ చెక్ క్రియేట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. శిరీష్ అనే వ్యక్తి చాట్‌జీపీటి 2.0 టూల్‌ను ఉపయోగించి UCO బ్యాంక్కు చెందిన రూ. 69,000 విలువైన ఒక చెక్కును క్రియేట్ చేశాడు. తర్వాత మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చూడండి అనే క్యాప్షన్‌తో ఆ చెక్ ఫోటోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ చెక్ చూడ్డానికి అచ్చం నిజమైన చెక్ లాగే కనిపిస్తోంది దానిపై బ్యాంక్ పేరు, బ్రాంచ్ వివరాలు, అకౌంట్ నంబర్, సంతకం, చెక్కు కింద ఉండే MICR బ్యాండ్ కూడా ఎంతో స్పష్టంగా కనిపించడం మీరు పోస్ట్‌లో చూడవచ్చు.
జనాల్లో ఆందోళలన
అయితే అతను చేసిన పోస్ట్ కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. కేవలం కొన్ని సెకన్లలో ఏఐ సహాయంతో అచ్చం నిజమైన చెక్కులాంటి నకిలీ చెక్‌ను ఏఐ క్రియేట్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన తర్వాత తమ బ్యాంక్ ఖతాల్లో ఉన్న డబ్బు సురక్షితమేనా అనే డౌట్ ప్రజల్లో మొదలైంది. అయితే అధికారులు మాత్రం జనాలు ఎలాంటి టెన్షన్ పడొద్దని సూచిస్తున్నారు. ఈ నకిలీ చెక్కును చూసి వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
నిపుణులు ఏమంటున్నారు
అసలైన చెక్కు పేపర్ నాణ్యతకు నకిలీ చెక్ పేపర్‌కు చాలా తేడా ఉంటుందని.. దానిపై ఉండే వాటర్‌మార్క్‌లు, సెక్యూరిటీ ఫీచర్లను ఏఐ కాపీ చేయలేదని చెబుతున్నారు. బ్యాంకులు కేవలం చెక్కు రూపాన్ని మాత్రమే చూడవని.. అవి CTS నిబంధనలను పాటిస్తాయని తెలిపారు. అసలైన చెక్కులపై UV లైట్‌లో మాత్రమే కనిపించే VOID అనే గుర్తు ఉంటుందని.. దీనిని ఏఐ సృష్టించలేదని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే ఇతర భద్రతా ప్రమాణాల వల్ల కేవలం ఒక ఏఐతో ఫోటోతో డబ్బులు డ్రా చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు.
ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
అయితే ఈ నఖిలీ చెక్‌లతో బ్యాంకులను మోసం చేయడం కష్టమే అయినా, సాధారణ ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటి పట్ల జనాలు చాలా జాగ్రత్తలు ఉండాలని సూచిస్తున్నారు. మీకు వాటిపై ఏవైనా అనుమానం కలిగితే వెంటనే సమీపంలో బ్యాంక్‌కు అధికారులను సంప్రదించాలన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.