పెను విషాదం, తీరని శోకాన్ని మిగిల్చిన టర్కీ, సిరియా భూకంపం ఘటనలో హృదయవిదారక దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. శిథిలాల మధ్యే ఓ మహిళ బిడ్డకు ప్రసవించి కన్నుమూస్తే.. ఆ చిన్నారిని ఆదుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. సిమెంట్ పిల్లర్ల మధ్య చిక్కుకున్న ఇద్దరు చిన్నారుల్లో తన తమ్ముడికి ఏమీ కాకూడదనే దృఢ సంకల్పంతో ఓ చిన్నారి చేతులు అడ్డు పెట్టుకుని కాపాడిన ఫొటో ప్రపంచమంతా కన్నీరు పెట్టించింది. ప్రస్తుతం కూడా అలాంటి ఘటనే జరిగింది. శిథిలాల మధ్యలో.. గడ్డకట్టే చలిలో.. ఆహారంలేని పరిస్థితుల్లో ఓ పది రోజుల పసికందు ప్రాణాలతో బయటపడడం సంచలనంగా మారింది. 90 గంటల పాటు జీవన్మరణ పోరాటం చేసి గెలిచింది. టర్కీలో సంభవించిన భూప్రళయంలో ఈ శిశువును, అతడి తల్లిని సహాయక సిబ్బంది రక్షించారు.
ఈ చిన్నారి పేరు యాగిజ్ ఉలాల్. తన తల్లితోపాటు శిథిలాల్లో చిక్కుకున్నాడు. సహాయకచర్యలు చేపడుతున్న సిబ్బందికి సిమెంట్ పెళ్లల మధ్య నుంచి చిన్న శబ్దం వినిపించింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆ బిడ్డను వెలికితీశారు. చిన్నారికి చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిని కూడా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరికి చికిత్స అందిస్తున్నారు. హతయ్ ప్రావిన్సులో భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు గడ్డకట్టే చలిలోనూ నిరంతరం శ్రమిస్తున్నాయి.
Yağız Ulaş bebek sadece 10 günlük. Depremden 90 saat sonra Hatay Samandağ’da annesi ile birlikte enkazdan çıkarıldı. pic.twitter.com/7jjjEXQfiV
— Ekrem İmamoğlu (@ekrem_imamoglu) February 9, 2023
సోమవారం తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపం టర్కీ, సిరియాను వణికించింది. మధ్యాహ్నం వచ్చిన మరో భీకర భూకంపానికి ఈ రెండు దేశాలూ మరోసారి చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రకృతి బీభత్సానికి వేలల్లో ప్రాణాలు కోల్పోగా.. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..