పెళ్లి విషయంలో ఆ దేవుడు ముందుగానే ఎవరు, ఎవరితో అనేది మ్యాచ్ ఫిక్స్ చేసి పంపుతాడని చెబుతారు. అలాంటి పెళ్లిని సరైన వయసులో చేసుకుంటే మంచిది. వైవాహిక జీవితంలోని అన్ని ఆనందాలను మనం అనుభవిస్తాం. కానీ, దేవుడు ప్రతి వ్యక్తిని సమానంగా సృష్టించలేదు అన్నది కూడా తప్పక అంగీకరించాల్సిన వాస్తవం. ఈ కారణంగా సమాజంలో జీవించేటప్పుడు కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు వివక్షను ఎదుర్కోవలసి వస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో నివసించే మొహమ్మద్ అర్షద్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అతని ఎత్తు కేవలం 3.7 అడుగులు. దాంతో అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎత్తు ఆగిపోయింది. కానీ, వయసు పెరుగుతూనే ఉంది. ఎట్టకేలకు 15ఏళ్ల నిరీక్షణ అనంతరం అర్షద్‌కు సరైన జోడి దొరికింది..
బులంద్‌షహర్ జిల్లాలోని సయానా నగరానికి చెందిన 35 ఏళ్ల మహ్మద్ అర్షద్ ఫర్నీచర్ వ్యాపారం చేస్తుండేవాడు.. కానీ, అతను 3.7 అడుగుల ఎత్తు మాత్రమే పెరిగాడు. దాంతో అతన్ని ఎవరు పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు. పెళ్లి గురించి ఆందోళనలో పడ్డాడు. అర్షద్ పరిస్థితికి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురయ్యారు. పైగా, తన చుట్టు పక్కల వారు కూడా అతన్నిహేళనగా చూస్తుండేవారు. 15ఏళ్లుగా అతడు 10సార్లు పెళ్లి చూపుల కోసం వెళ్లాడు.. కానీ, ప్రతి సారీ అతడు అవమానాలే ఎదుర్కొన్నాడు.
కానీ, అతను ఎప్పుడూ అసహనానికి గురయ్యేవాడుకాదు.. సరైన జీవిత భాగస్వామి దొరుకుతుందనే ఆశను అతడు ఎప్పుడూ కోల్పోలేదు. నాలుగు నెలల క్రితం బంధువు 4 అడుగుల ఎత్తు ఉన్న సోనా గురించి చెప్పాడు. అప్పుడు అర్షద్ కుటుంబ సభ్యులు వెళ్లి సోనా ఫ్యామిలీతో మాట్లాడారు. చివరకు ఫిబ్రవరి 14, బుధవారం ప్రేమికుల రోజున 30 ఏళ్ల సోనాను పెళ్లి చేసుకున్నాడు. దాంతో అర్షద్ స్నేహితులు నగరమంతా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.
సన్‌రూఫ్ నుండి మెరూన్ కలర్ షేర్వానీ ధరించి బయటకు వచ్చిన మహ్మద్ అర్షద్ వరుడు కావడం చూసిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. బంధువులు బ్యాండ్‌తో వధువును తీసుకురావడంతో పెళ్లి సందడి మరింత ఉత్సాహంగా మారింది. మహమ్మద్ అర్షద్ ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే 15 సంవత్సరాలు వెతికి, 10 సార్లు తిరస్కరించబడిన తరువాత, అతనికి సరిగ్గా తనలాంటి అమ్మాయి దొరికిందని చెప్పాడు. అతను అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడల్లా ఎత్తు గురించి ఆందోళన పడేవాడు.. ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నాడు. చాలా మంది స్నేహితులు, బంధువులు తనను చిన్న చూపు చూశారని వాపోయాడు. ఇంత పొట్టి వ్యక్తికి కుమార్తెను ఎవరు ఇస్తారని చాలా సార్లు బాధపడ్డానని చెప్పాడు.
అర్షద్ చెప్పిన ప్రకారం, ఎంతో కన్విన్స్ చేసిన తర్వాత, సోనా కుటుంబం తనను అంగీకరించిందని చెప్పాడు. ఇప్పుడు వీరి కలయికతో ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. అలాగే కొత్తగా పెళ్లయిన కొత్త జంటకు బంధువులు, స్నేహితులు ఆశీర్వాదాలు, బహుమతులు అందించారు. ఊరంతా టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. అర్షద్ పెళ్లి అట్టహాసంగా నిర్వహించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..