
రెండో ప్రపంచ యుద్ధం (World War II) ముగిసి దశాబ్దాలు గడుస్తున్నా, నాటి భయంకరమైన యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచే చారిత్రక అవశేషాలు భూగర్భం నుండి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా జర్మనీలోని ఉత్తర తీర ప్రాంతంలో దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి ఒక అరుదైన నాజీ సైనిక ట్యాంక్ అత్యంత అద్భుతమైన స్థితిలో వెలుగుచూసింది. జర్మనీలోని కుక్స్‌హావెన్ (Cuxhaven) జిల్లాలో ఉన్న నార్డ్‌హోల్జ్ నౌకాదళ వైమానిక స్థావరం (Nordholz Naval Air Base) వద్ద నిర్మాణ పనుల కోసం కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా ఈ భారీ సైనిక వాహనం లభ్యమైంది.
పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ మిలిటరీ వాహనాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ అత్యధికంగా ఉత్పత్తి చేసిన StuG III (Sturmgeschütz III) అసాల్ట్ గన్ వాహనంగా గుర్తించారు. సాధారణంగా దశాబ్దాల పాటు భూమిలో పూడిపోయి ఉంటే ఇనుప వాహనాలు తుప్పుపట్టి నశించిపోతాయి. కానీ, ఈ ట్యాంక్ ఒక ఎండిన ఇసుక తిన్నె కింద పూడిపోయి ఉండటం వల్ల వాతావరణ తేమ దీనికి తగల్లేదు. ఫలితంగా, 80 ఏళ్లు గడిచినా దీని ఒరిజినల్ క్యామఫ్లేజ్ రంగు (పెయింట్), రన్నింగ్ గేర్, లోపలి భాగాలు ఏమాత్రం పాడవకుండా సురక్షితంగా ఉన్నాయి. ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ ఆండ్రియాస్ హ్యూజర్ మాట్లాడుతూ.. ఇంత పూర్తి స్థాయిలో ఒక యుద్ధ ట్యాంక్ లభించడం చాలా అరుదైన విషయమని తెలిపారు.
ఈ ట్యాంక్ ప్రధాన ఆకర్షణ దాని ఫిరంగి బారెల్ (Gun Barrel) పై స్పష్టంగా కనిపిస్తున్న 17 తెల్లటి గీతలు (గుర్తులు). రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ సైనికులు తాము శత్రు పక్షానికి చెందిన ఎన్ని ట్యాంకులు లేదా యుద్ధ వాహనాలను విజయవంతంగా ధ్వంసం చేశారో.. అన్ని గుర్తులను తమ ట్యాంక్ బారెల్‌పై వేసుకునేవారు. ఈ ఆధారాల ప్రకారం, ఈ నిర్దిష్ట StuG III ట్యాంక్ యుద్ధ క్షేత్రంలో శత్రువులకు చెందిన కనీసం 17 ట్యాంకులను మట్టుబెట్టి ఉంటుందని నిపుణులు గట్టిగా అంచనా వేస్తున్నారు.
ఈ StuG III వాహనానికి ఇతర సాధారణ ట్యాంకుల మాదిరిగా తిరిగే తుపాకీ బురుజు (Rotating Turret) ఉండదు. దీనివల్ల నలుగురు సభ్యులుండే దీని సైనిక సిబ్బంది శత్రువును కాల్చడానికి ప్రతిసారీ ట్యాంక్ మొత్తాన్ని ఆ దిశగా తిప్పాల్సి వచ్చేది. ట్యాంక్ లోపలి భాగం చాలా ఇరుగ్గా, ఊపిరాడనంత ఒత్తిడితో కూడి ఉందని, నాటి సైనికులు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో పోరాడారో ఇది స్పష్టం చేస్తోందని నిపుణులు పేర్కొన్నారు. యుద్ధంలో ఓటమి తర్వాత మిత్రదేశాల సైన్యం (Allied Forces) ఆయుధాలను ధ్వంసం చేసే క్రమంలో దీన్ని ఇసుకలో పాతిపెట్టి ఉండవచ్చు. ప్రస్తుతం ఈ ట్యాంకును అదనపు సంరక్షణ పనుల కోసం మున్‌స్టర్‌కు తరలించి, అనంతరం డ్రెస్డెన్‌లోని సైనిక చరిత్ర మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..