రోడ్డు రోలర్‌ శబ్దాన్ని భూకంపంగా పొరబడి.. స్కూల్‌ కిటికీలోంచి దూకేసిన విద్యార్థులు! తర్వాత జరిగిందిదే..

|

Dec 19, 2024 | 5:17 PM

స్కూల్ భవనం పక్కనే రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రోడ్డు రోలర్ అక్కడ పనులు చేస్తుంది. అయితే పక్కనే ఉన్న ప్రభుత్వ స్కూల్లోని పిల్లలు ఆ శబ్ధాలను విన్నారు. పైగా వారి టేబుళ్లు, పుస్తకాలు కూడా ప్రకంపనలకు కదలడం గమనించారు. అంతా వారంతా భూకంపం వచ్చిందని పొరబడి.. అమాంతం స్కూల్ భవనం కిటికీలోంచి కిందకి దూకేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

రోడ్డు రోలర్‌ శబ్దాన్ని భూకంపంగా పొరబడి.. స్కూల్‌ కిటికీలోంచి దూకేసిన విద్యార్థులు! తర్వాత జరిగిందిదే..
Schoolgirls Jump Out Of School Building Window
Follow us on

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 19: రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న రోడ్డు రోలర్‌ శబ్ధాన్ని విని పక్కనే ఉన్న స్కూల్లో చదువుకుంటున్న విద్యార్ధులు భూకంపంగా పొరబడ్డారు. అంతే.. స్కూల్‌ భవనం పడిపోతుందన్న భయంతో హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. కొందరైతే ఏకంగా తరగతి గది కిటీకి తలుపులు తెరచి అందులో నుంచి కిందికి దూకేశారు. దీంతో ఆ విద్యార్ధులంతా చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ విచిత్ర ఘటన పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్సులోని జహానియన్‌, ఖనేవాల్‌ జిల్లాలో బుధవారం (డిసెంబర్‌ 19) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని ఖనేవాల్ జిల్లాలోని జహానియన్‌లో ఓ పాఠశాల ఉంది. అందులో 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు చదువుతున్నారు. అయితే బుధవారం విద్యార్ధులంతా తరగతి గదిలో ఉండగా వారికి కంపనాలు పోలిన ధ్వనులు వినిపించాయి. స్కూల్‌ పక్కనే ఉన్న రహదారి నిర్మాణ పనులలో భాగంగా రోడ్ రోలర్ కారణంగా ఈ విధమైన శబ్దం వినిపించింది. సరిగ్గా అదే సమయానికి తరగతి గదిలో టీచర్లు కూడా లేకపోవడంతో పిల్లలంతా రోడ్డు రోలర్‌ శబ్ధాలను భూకంపంగా భావించారు. దీంతో భూకంపం వస్తుందని, స్కూల్‌ భవనం కూలిపోవచ్చని భావించి ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికలు ఒక్కసారిగా భయంతో మొదటి అంతస్తునుంచి కిందకు మెట్ల మార్గంలో పరుగులు తీశారు. వీరిలో ఎనిమిది మంది భవనం మొదటి అంతస్తు కిటికీలో నుంచి కిందకి దూకేశారు.

దీంతో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఓ బాలిక మాట్లాడుతూ.. ‘మేము క్లాస్‌రూమ్‌లో దాదాపు 20 మంది ఉన్నాం. ఉన్నట్లుండి మా క్లాస్‌ రూంలోని వస్తువులు, పరిసరాలు కదులుతున్నట్లు అనిపించింది. పెద్ద శబ్దం కూడా విన్నాం. ఇది భూకంపం అనుకుని, పైకప్పు కూలిపోతుందన్న భయంతో కొంతమంది అమ్మాయిలు కిటికీలో నుంచి దూకేశారు. వాళ్లను చూసి నేను కూడా దూకేశాను’ అని చెప్పింది. ఇక ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ స్పందిస్తూ.. గాయపడిన బాలికలకు సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆరోగ్య అధికారులను ఆదేశించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.