Viral: పోలీసులకు ఫోన్ చేసి.. తన తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు.. ఏమని అంటే..?
అమెరికాలోని విస్కాన్సిన్‌కి చెందిన 4 ఏళ్ల బాలుడు 911కి కాల్ చేసి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. ఆమెను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కోరాడు. ఇంతకీ బాలుడికి అంతగా కోపం తెప్పించే పని ఆ తల్లి ఏం చేసింది. అధికారులు ఇంటికి వెళ్లి ఏం చేశారు.. తెలుసుకుందాం పదండి....

చిన్న పిల్లల అల్లరి చేష్టలు కొన్నిసార్లు చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. ఏది వద్దు అంటే వారు అదే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు తమకు ఇష్టమైన దుస్తులు, బొమ్మలు, స్నాక్స్ ఎవరితోనూ షేర్ చేసుకోడానికి ఇష్టపడరు. వాటిని ఎవరైనా టచ్ చేస్తే.. ఏడుస్తారు.. లేదంటే కోపంతో ఊగిపోతారు. అమెరికాలో ఓ బుడ్డోడికి కూడా అలానే తల్లిపై కోపం వచ్చింది. అందుకు కారణం ఆ చిన్నోడికి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీంను ఆమె తినేయడం.. దీంతో ఏకంగా అత్యవసర సేవల కాల్ సెంటర్ 911కు కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. తన ఐస్ క్రీం దొంగతనం చేసిన తల్లిని అరెస్ట్ చేయాలని అధికారులను అభ్యర్థించాడు. 911 సిబ్బందికి, పిల్లోడికి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. విస్కాన్సిన్‌లో ఈ ఘటన జరిగింది. ఆ ఆడియో సంభాషణ ఇలా…..
911 ఆఫీస్ డిస్పాచర్: “హలో, ఇది రేసిన్ కౌంటీ 911. మీ ఎమర్జెన్సీ అడ్రస్ ఏమిటి?”
అబ్బాయి: “మా అమ్మ మంచిగా బిహేవ్ చేయడం లేదు.”
911 ఆఫీస్ డిస్పాచర్: “సరే, ఏం జరుగుతోంది?”
అబ్బాయి: “వచ్చి మా అమ్మని తీసుకుపోండి.”
911 ఆఫీస్ డిస్పాచర్: “సరే, ఏం జరుగుతోంది?”
అబ్బాయి: “మా అమ్మను తీసుకెళ్లండి.”
911 ఆఫీస్ డిస్పాచర్: ” హాయ్, అక్కడ ఏమి జరుగుతోంది.. మీకు తెలుసా?”
ఇంతలో లైన్‌లోకి వచ్చిన బాలుడి మదర్: “ఓహ్, బాబు తెలియక కాల్ చేశాడు. వాడి వయస్సు నాలుగేళ్లు మాత్రమే”
911 ఆఫీస్ డిస్పాచర్: ఓకే
ఇంతలో పక్క నుంచి బాలుడు: “నేను పోలీసులకు ఫోన్ చేసి అమ్మను జైలులో పెట్టమని చెప్పాను.నన్ను ఒంటరిగా వదిలేయండి.”
బాలుడి మదర్: “తన ఐస్ క్రీం తిన్నామని.. కంప్లైంట్ చేసేందుకు మీకు కాల్ చేశాడు..”
ఆ తర్వాత 911 ఆఫీస్ డిస్పాచర్ నవ్వడం ఈ ఆడియో రికార్డింగ్‌లో వినిపించింది..
ఆ తర్వాత… ఆ పిల్లవాడు తెలియక కాల్ చేశాడా.. లేదా నిజంగా ఏదైనా సమస్యలో ఉన్నాడో తెలుసుకునేందుకు.. ఆఫీసర్స్ ఆ కుటుంబం ఇంటికి వెళ్లారు.
పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ బాలుడు తన తల్లి తన ఐస్ క్రీం తిన్నందుకే కాల్ చేశానని తెలిపాడు. దాని కోసం ఆమెను జైలుకు పంపాలని మళ్ళీ డిమాండ్ చేశాడని పోలీసులు తెలిపారు.
ఆ చిన్నారి చివరికి తన తల్లిని జైలులో పెట్టడం తనకు ఇష్టం లేదని, తనకు కేవలం ఐస్ క్రీం మాత్రమే కావాలని చెప్పాడని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆఫీసర్స్.. అతనికి ఇష్టమైన ఐస్‌క్రీం రెండు స్కూప్‌లు అందజేసి.. ఇంత హంగామా చేసిని ఆ బుడ్డోడితో ఓ ఫోటో దిగారు.
(SOUND ON🔊🔊) FOUR-YEAR-OLD WISCONSIN BOY CALLS 911 ON HIS MOTHER FOR EATING HIS ICE CREAM: “MY MOMMY IS BEING BAD, COME AND GET MY MOMMY” pic.twitter.com/9BQ4JAENrn
— Poetik Flakko (@FlakkoPoetik) March 9, 2025