శబరిమల అయ్యప్ప మండల దీక్ష సీజన్ మొదలై కొన్ని రోజులే అవుతోంది. అయితే, ఇప్పటికే శబరిమల అయ్యప్ప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో భారీ విషసర్పాలు కలకలం రేపుతున్నాయి. శబరిమల ఆలయ పరిసరాల్లో ఈ సీజన్ మొదలైనప్పటికీ నుంచి ఇప్పటి వరకు 33 పాములను పట్టుకున్నారు. వీటిలో కామన్ క్రెయిట్(అనాలీ), 14 వైల్డ్ స్నేక్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
సన్నిధానంలో పాములను రక్షించిన వీడియోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు భక్తులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. పెరియార్ వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతంలో నడుస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సర్పాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాము కాటు సంఘటనలు చాలా తక్కువే నమోదు అవుతున్నట్లు తెలిపారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో శబరిమల క్షేత్రంలో పాములు సంచరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో కింగ్ కోబ్రాలు ఆ ప్రాంతంలో ఉండేవని, కానీ ఇప్పుడు చాలా వరకు విషం లేని సర్పాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పాము కాటుకు సంబంధించిన వైద్య చికిత్స సన్నిధానం, పంపా వద్ద అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
ఇకపోతే, శబరిమల యాత్రలో భక్తులు, యాత్రికులు నడవడానికి ఉపయోగించే ప్రధాన మార్గాలు, రహదారులపై సూచిక బోర్డులను అనుసరించాలని చెబుతున్నారు. చీకటిగా ఉన్నప్పుడు, తగినంత వెలుతురు లేని ప్రదేశాలలో నడుస్తున్నప్పుడు టార్చ్‌లను ఉపయోగించాలని చెబుతున్నారు. ఎక్కడైనా పాములు ఎదురుపడినా, కనిపించినా దానిని పట్టుకోవటానికి, దానికి హాని కలిగించడానికి ప్రయత్నించవద్దు. వీలైనంత దూరం పాటించండి. సమీపంలోని అధికారికి తెలియజేయాలంటూ సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..