ఆగ్రా, నవంబర్ 4: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ఆదిత్య శర్మ అనే 14 యేళ్ల బాలుడు తీవ్ర కుడుపు నొప్పితో బాధపడుతుండటంతో.. తల్లిదండ్రులు సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వ్యైద్యులు బాలుడి కడుపు నొప్పికి గల కారణాలు తెలుసుకునేందుకు కడుపు భాగాన్ని సీటీ స్కానింగ్ చేశారు. అందులో నాసల్ బ్లాకేజ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడి కడుపులో రకరకాల వస్తువులు కనిపించాయి. వాటిల్లో బ్యాటరీలు, గొలుసులు, రేజర్ బ్లేడ్‌లు కూడా ఉండటంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బాలుడికి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వెంటనే నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు.
అనంతరం బాలుడి పరిస్థితి క్లిష్టంగా మారడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తెలిపారు. అదే రోజు నోయిడాలోని డాక్టర్లు ఆపరేషన్ మొదలు పెట్టారు. సుమారు 6 గంటలపాటు ఆపరేషన్ చేసి బాలుడి కడుపు నుంచి బ్యాటరీలు, బ్లేడ్లు, స్క్రూలు వంటి దాదాపు 65 రకాల వస్తువులను బయటికి తీశారు. ఈ క్లిష్టమైన శస్త్ర చికిత్స జరిగిన కొన్ని గంటలకే బాలుడు మృతి చెందాడు. గత నెల 28న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ దవాఖానలో ఈ ఘటన జరిగింది. కడుపులోని వస్తువుల కారణంగా తీవ్రమైన పేగు ఇన్‌ఫెక్షన్ జరిగి బాలుడు మృతి చెందాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఆదిత్య తండ్రి సంచేత్ శర్మ మాట్లాడుతూ.. తన కుమారుడు గత నెల 13న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, అసౌకర్యంతో బాధపడుతుండటంతో ఆగ్రాలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి తీసుకెళ్లడానికి ముందు జైపూర్, అలీఘర్, నోయిడా, ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లామని ఆయన తెలిపారు. అయితే తీవ్ర ఆలస్యం కావడంతో బాలుడు కడుపులో ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. ఇంతలో బాలుడి గుండె వేగం నిమిషానికి 280కి చేరుకుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆపరేషన్ జరిగినప్పటికీ అక్టోబర్ 28వ తేదీ రాత్రి చనిపోయాడు. అంతా కేవలం ఒక్క నెలలోనే జరిగిపోయింది. గతంలో బాలుడికి ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు లేవని తెలిపాడు.