
తమిళనాడులోని ఓ శతాధిక వృద్ధుడు జీవన విధానం నేటి తరానికి స్పూర్తి అని చెప్పవచ్చు. 120 ఏళ్ల వయసులోనూ తన కాళ్ళపై తాను నిలబడుతూ, కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రుచికరమైన లడ్డూలు తయారు చేసి విక్రయిస్తూ జీవిస్తున్న ఆ గొప్ప వ్యక్తి పేరు మహ్మద్ అబు సలీమ్. ఇప్పుడు ఇతనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బర్మాలో పుట్టిన సలీమ్.. కొన్ని దశాబ్దాల క్రితమే తమిళనాడుకు వలస వచ్చారు ఇక్కడే స్థిర పడ్డారు. అయితే జీవించడం కోసం పోరాడుతున్న ఈ వృద్ధుడిని విధి వెక్కిరించింది. ఓ ప్రమాదంలో తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయారు. ఒక్కసారే అయినవారినందరినీ పోగొట్టుకున్న సలీమ్ ఆ విషాదాన్ని తట్టుకుని తన జీవనోపాధి కోసం స్వీట్స్ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. అలా మొదలైన లడ్డూ తయారీల ప్రయాణం 50 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.
50 సంవత్సరాల నుంచి సలీమ్ అల్లం, కొబ్బరి, గ్లూకోజ్ కలయికతో లడ్డూలను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ఈయన చేసే లడ్డులకు కడలూరు, విల్లుపురం, తిండివనం, మాయావరం, కుంభకోణం వంటి అనేక ప్రాంతాల్లో మంచి పేరు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఆయా ప్రాంతాలకు వెళ్లి స్వయంగా లడ్డులను అమ్మేవారు.. అయితే ఇప్పుడు వయసు మీదపడింది.. అంత దూరం ప్రయాణం చేసే పరిస్థితి లేదు. దీంతో ఇపుడు ఇంటి దగ్గరే లడ్డులు చేసి అమ్ముతున్నారు. స్థానికులు.. ఆయన లడ్డుల గురించి తెల్సిన వారు ఇంటి దగ్గరకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
అయితే షాకింగ్ విషయం ఏమిటంటే సలీం నేటికీ రోజుకి రెండు లడ్డులు హ్యాపీగా తింటారు. అసలు ఎటువంటి సమస్యలు లేవు అని చెబుతున్నారు. ఇటీవల మహ్మద్ షేక్ అనే యువకుడు సలీమ్ తాతని ఇంటర్వ్యు చేశాడు. ప్రస్తుతం ఈ తాతగారి గురించి ఆరోగ్య రహస్యం గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 120 ఏళ్ల వయసులోనూ సలీమ్ కష్టపడి పని చేస్తున్న తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విశ్రాంతిని కోరుకునే వయసులో సలీమ్ మాత్రం కష్టపడుతూ జీవితానికే ఓ ప్రేరణగా నిలిచారు. తాతగారి జీవితం ఒక జీవన పాఠం అని .. నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..