బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పూర్‌లోని సక్రాలోని మచ్చి గ్రామానికి చెందిన రాజేష్ మహతో 10 ఏళ్ల కుమారుడు ఆదర్శ్ చింతపండు తిని మరణించాడు. ఆదర్శ్ మూడో తరగతి విద్యార్థి. నివేదికల ప్రకారం, ఆదర్శ్ శనివారం చింతపండు తింటుండగా దాని గింజలను మింగేశాడు. దాంతో అతనికి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఒక్కసారిగా అతని ఊపిరి ఆగిపోయింది.
కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటినా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఒక్కసారిగా బాలుడి పరిస్థితి విషమంగా మారింది. కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ముజఫర్‌పూర్‌కు తీసుకెళ్లారు. అల్ట్రాసౌండ్ నిర్వహించిన తర్వాత, ఆదర్శ్ ఊపిరితిత్తులకు చింతపండు గింజలు అంటుకున్నట్లుగా గుర్తించారు. వైద్యం చేయలేక ఆ చిన్నారిని డాక్టర్లు పాట్నా పంపించారు.
వైద్యుల సలహా మేరకు కుటుంబసభ్యులు ఆదర్శ్‌తో కలిసి పాట్నాకు బయలుదేరారు. అయితే ఆ బాలుడు పాట్నాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చింతపండు వికటించి చిన్నారి మృతి చెందిన వార్త ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. చిన్న తప్పిదం నవ్వుతున్న చిన్నారి ప్రాణం తీసింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..