Y.S. Sharmila: టాక్ ఆఫ్ ది తెలంగాణ అవడంలో వైఎస్ షర్మిల సక్సెస్..! రెండు రోజులుగా ఆమె చుట్టే తిరిగిన రాజకీయం..

|

Apr 25, 2023 | 9:08 PM

రెండు రోజులుగా ఆమె సృష్టించిన హడావుడి.. పోలీసులు వ్యవరించిన తీరు.. ఆపై అరెస్టు... ఆనక విడుదల... మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో అడుగడుగునా ట్విస్టులు.. ఆసక్తికర మలుపులు అన్నీ ఉన్నాయి. పోలీసులపై దాడి కేసులో అరెస్టైన YS షర్మిల జైల్లోంచి విడుదలయ్యారు. ఈ అరెస్ట్‌లకు భయపడేది లేదని .. తెలంగాణ ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారామె.

Y.S. Sharmila: టాక్ ఆఫ్ ది తెలంగాణ అవడంలో వైఎస్ షర్మిల సక్సెస్..! రెండు రోజులుగా ఆమె చుట్టే తిరిగిన రాజకీయం..
Y.s. Sharmila
Follow us on

ఏదైతేనేం… వైఎస్ షర్మిల టాక్ ఆఫ్ ది తెలంగాణ అవడంలో సక్సెస్ అయినట్టేనా.. రెండు రోజులుగా ఆమె సృష్టించిన హడావుడి.. పోలీసులు వ్యవరించిన తీరు.. ఆపై అరెస్టు… ఆనక విడుదల… మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో అడుగడుగునా ట్విస్టులు.. ఆసక్తికర మలుపులు అన్నీ ఉన్నాయి. సోమవారం ఉదయం ఆమె బయటకు రావడంతోనే మొదలైన హడావుడి చినికి చినికి గాలివానలా మారింది. సిట్ కార్యాలయానికి వెళ్దామని బయల్దేరిన ఆమెను ఇంట్లోంచి బయటకు రాగానే అడ్డుకున్న పోలీసులు.. ఆపై వాహానాన్ని కదలకుండా చేశారు. అంతే అక్కడి నుంచి మొదలయ్యింది అసలు ఎపిసోడ్. వాదోపవాదాలు… తోపులాటలు.. చివరకు చేయి చేసుకోవడాలు. ఇలా ఆద్యంతం హై టెన్షన్‌ను క్రియేట్ చేసింది. మొత్తం మీడియా ఫోకస్ అంతా లోటస్ పాండ్‌కు షిఫ్ట్ అయ్యింది. అసలు కథ అప్పటి నుంచే మొదలయ్యింది.

ఈ తోపులాటలో ఉన్నట్టుండి షర్మిల పోలీసులపై చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా సిట్యువేషన్ మారిపోయింది. ఓ ఎస్ఐపై ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్‌‌ ఇద్దరి చెంప ఛెళ్లుమనిపించారు షర్మిల. అంతే.. ఏ ఛానెల్ చూసినా.. ఇదే రచ్చ. షర్మిల చేయి చేసుకున్న దృశ్యాలను హైలెట్ చేస్తూ పదే పదే చూపిస్తూ వచ్చారు. గంటల కొద్దీ లైవ్స్‌ నడిపారు. మొత్తంగా ఆమె దీక్షలు, పాదయాత్రలు చేసినా సరే దొరకనంత ఎయిర్ టైం ఫ్రీ గా దొరికింది.

అ తర్వాత సీన్ లోటస్ పాండ్ నుంచి జూబ్లీ హిల్స్‌ పోలీస్ స్టేషన్‌కి మారింది. యాజ్ యూజవల్.. మీడియా కూడా తన ఫోకస్‌ను జూబ్లీ హిల్స్‌కి షిఫ్ట్ చేసింది. అక్కడ అంతకన్నా హైడ్రామా నడిచింది. ఈ సారి వంతు షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి గారిది. అరెస్ట్ అయిన తన కుమార్తెను పరామర్శించేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు స్టేషన్లోకి రాకుండా అడ్డుకున్నారు. అక్కడ నుంచి పంపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేశారు. కానీ ఆమె మాత్రం కదిలేదే లేదంటూ భీష్మించుకొని వెహికల్లోనే ఉండిపోయారు. చివరకు అక్కడ కూడా క్రమంగా సీన్ హీటెక్కింది. పోలీసులకు-ఆమెకు మధ్య జరిగిన వాగ్వాదంలో ఓ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు విజయలక్ష్మి. ఇక చెప్పేదేం ఉంది… అదే బ్రేకింగ్ న్యూస్. కవరేజ్ కంటిన్యూస్.

ఓ రకంగా అక్కడ నుంచి ఇష్యూ మరింత క్రిటికల్ అయ్యింది. ఆమెను పోలీసులు ఎలాగోలా ఇంటికి పంపించివేసినా… షర్మిలను స్టేషన్లోనే ఉంచడం.. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై చేయిచేసుకున్నందుకు ఆమెపై బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో మీడియాకు మరో వార్తతో పని లేకుండా పోయింది. చివరకు ఆమెను కోర్టు రిమాండ్‌కి పంపేంత వరకు ఇదే హడావుడి.. హంగామా. మొత్తంగా మార్నింగ్ ఈవినింగ్ టోటల్ మీడియాకు ఇంతకు మించిన వార్త.. ఇంతకు మించిన పొలిటికల్ డ్రామా లేకుండా చెయ్యడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు షర్మిల.
ముందే చెప్పినట్టు… ఇప్పటి వరకు ఆమె తెలంగాణలో చేసిన పాదయాత్రలకు గానీ, నిరసన దీక్షలకు గానీ రానంత మైలేజ్ వచ్చిందనడంలో నోడౌట్స్.

అలాగని ఇష్యూ ఆ రోజుతో ముగిసిపోతే.. అది అందులో కిక్కేముంటుంది. అరెస్టయిన నేతలు బెయిల్ కోసం అప్లై చెయ్యకుండా ఉంటారా.. షర్మిల కూడా అదే చేశారు. అంతలోనే జైల్లో ఉన్న తన కుమార్తెను పరామర్శించేందుకు వెళ్లారు తల్లి విజయలక్ష్మి. ప్రశ్నించే గొంతుల్ని నొక్కే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందంటూ విమర్శల వర్షం కురిపించారు. ఆపై షర్మిలకు బెయిల్ తప్పనిసరిగా వస్తుందంటూ కార్యకర్తలెవ్వరూ ఆందోళన చెందాల్సినవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.

ఆమె ఊహించినట్టే షర్మిలకు మధ్యాహ్నానికే బెయిల్ రావడం.. ఆ తర్వాత ఆమె విడుదల కావడం జరిగిపోయాయి. విజయోత్సాహంతో బయటకొచ్చిన ఆమె… అంటే ఈ మధ్య కాలంలో బెయిల్‌పై విడుదల కావడం కూడా మన నేతలకు విజయంగానే కనిపిస్తోంది కనుక మనం విజయోత్సాహం అనడంలో ఎలాంటి ఇబ్బంది లేదనే అనుకుంటున్నా. సో… జైలు నుంచి విడుదలై వచ్చిన ఆమెను చంచల్ గూడ జైలు గేటు ముందే మీడియా ఆపడం.. అప్పటికప్పుడు అక్కడో ఓ మీడియా పాయింట్‌ను తాత్కాలికంగా క్రియేట్ చెయ్యడం జరిగిపోయింది. అంతా ఊహించినట్టుగానే ఆమె కేసీఆర్ సర్కారుపై మాటల యుద్ధం ప్రకటించారు. పదే పదే తనపై మగ పోలీసులు తాకేందుకు ప్రయత్నించడం, చేయి వెయ్యడం, లాగడం చేస్తుండే సరికి తనను తాను రక్షించుకోవడం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అసలు తనను ఇంట్లోంచి బయటకు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బుధవారం ఇందిరా పార్క్ వేదికగా దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అది షర్మిల లేటెస్ట్ ఎపిసోడ్. మొత్తంగా ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంగళవారం సాయంత్రం ఎండ్ కార్డ్ పడేంత వరకు… ఏ మీడియా కూడా షర్మిల వార్తల్ని కవర్ చెయ్యకుండా లేదు. పోటీ పడి మరీ ఎక్స్ క్లూజివ్ కవరేజ్‌ అంటూ మాగ్జిమమ్ ఎయిర్ టైం ఆమెకే కేటాయించాయి. ఇది ముమ్మాటికి షర్మిల సక్సెస్ అనే చెప్పాలి. నిజానికి బుధవారం నాటి దీక్షకు కూడా ఈ స్థాయిలో కవరేజ్ ఉంటుందని చెప్పలేం. ఓ రాజకీయ నేతగా ఎవ్వరికైనా కావాల్సింది ఇదే… ఎవ్వరైనా కోరుకునేది ఇదే… వీలైనంత వరకు వార్తల్లో ఉండటం… ఆమె దీక్షలకు.. ఆమె డిమాండ్లకు అధికార పార్టీ స్పందిస్తుందా.. లేదా అన్నది వేరే సంగతి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం