తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ పొత్తులు, విలీనాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనంపై ఆ పార్టీ అధినేత షర్మిల క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌తో ఎలా కలిసి పనిచేయాలనే దానిపై సోనియా, రాహుల్‌గాంధీతో చర్చించినట్లు ఆమె వెల్లడించారు. ఈ చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారామె.
సోనియా, రాహుల్ గాంధీతో మీటింగ్ తర్వాత షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ చేశారన్న ప్రచారముంది. పాలేరు సీటు గురించి షర్మిల పట్టుబట్టినా, కాంగ్రెస్ అందుకు రెడీగా లేదని తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్ హోదాతో పాటు రాజ్యసభ సీటు, ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతల అప్పగింత లాంటి అంశాలపై డిస్కషన్స్ జరిగాయని తెలుస్తోంది. మరోవైపు రెండేళ్లుగా పాలేరులో పోటీకి ఏర్పాటు చేసుకుంటున్న షర్మిల, త్వరలో దానిపై క్లారిటి ఇస్తానని తెలిపారు. సరిగ్గా ఇదే టైమ్‌లో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఖమ్మంలోని తుమ్మల నివాసానికి వెళ్లిన పొంగులేటి.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్‌లో తుమ్మలతో సమావేశమై పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. BRS పార్టీ తనను అవమానించిన రీతిలోనే మాజీ మంత్రి తుమ్మలను అవమానిస్తోందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలని సవాల్ చేశారు.
కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన పొంగులేటికి ధన్యవాదాలు చెప్పారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అనుచరుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానన్నారు. తుమ్మల నాగేశ్వరరావు BRSను వీడటం ఖాయమైనప్పటికీ.. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరుతారన్నది మాత్రం అనుచరులతో సమావేశం తర్వాతే క్లారిటీ రానుంది. ఇటు షర్మిల, ఆటు తుమ్మల కాంగ్రెస్‌లో చేరిక ఖాయం కావడంతో హస్తం పార్టీలో పాలేరు సీటు హాట్‌టాఫిక్‌గా మారింది.
పాలేరు సీటు కోసం షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి ఆశ పెట్టుకున్న షర్మిల, ఏకంగా తన పార్టీనే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. అటు క్లియర్ క్లారిటీతో తన అనుయాయులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాలేరు నుంచి పోటీకి సై అంటున్నారు. ఇక తుమ్మల కూడా పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దాంతో పాలేరు టికెట్ ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీకి మరింత బలం పెరుగుతుందని అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం