
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జానపద గేయాలకు నాట్యాభినయంతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌరవేణి శ్రీవాణి ఇప్పుడు గ్రామ పాలన బాధ్యతలు చేపట్టారు. ఇల్లంతకుంట మండలం బోటుమీదపల్లె గ్రామ సర్పంచ్‌గా శ్రీవాణి గెలుపొందారు. ఎన్నికల్లో విజయం సాధించడం జిల్లా రాజకీయాలతో పాటు సాంస్కృతిక రంగంలోనూ చర్చనీయాంశంగా మారింది.
చిన్నప్పటి నుంచే నాట్యం అంటే ఆసక్తి కలిగిన శ్రీవాణి, మొదట తన సోదరుడు బాబు వద్ద నాట్య ప్రాథమికాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత క్లాసికల్ డాన్స్ మాస్టర్ సత్యం వద్ద శాస్త్రీయ నాట్య మెలకువలు సాధించారు. జానపద నాట్యంలో సహజత్వం, శాస్త్రీయ నాట్యంలో క్రమశిక్షణను మేళవించి తనకంటూ ప్రత్యేక శైలిని రూపొందించుకున్నారు.
కాలానుగుణంగా సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్న శ్రీవాణి యూట్యూబ్‌లో జానపద నాట్యంతో విస్తృత ఆదరణ పొందారు. ఇప్పటివరకు 300కు పైగా జానపద పాటలకు నృత్యాభినయం చేశారు. “నాగులమ్మ.. నాగులమ్మ.. నల్ల నాగులమ్మ”, “చిన్న దొర బంగ్లా మీద సీటీలెయ్యకురా”, “తెల్లచీర కట్టుకొని టేకుళ్లకు కలువబోతే” వంటి పాటలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.
జానపద కళను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో శ్రీవాణి ఆర్‌ఎన్‌ఎస్ (RNS) డ్యాన్స్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, యువతకు నాట్య శిక్షణ అందిస్తున్నారు. అంతరించిపోతున్న జానపద కళలకు పునరుజ్జీవనం తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన శ్రీవాణికి బోటుమీదపల్లెకు చెందిన గౌరవేణి సుమన్‌తో వివాహం జరిగింది. వివాహానంతరం బోటుమీదపల్లెనే తన కర్మభూమిగా మార్చుకున్నారు. గ్రామస్తులతో సత్సంబంధాలు పెంచుకుంటూ, పండుగలు, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల నమ్మకాన్ని పొందారు.
దాచారం అనుబంధ గ్రామంగా ఉన్న బోటుమీదపల్లె ఇటీవలే నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. మహిళా రిజర్వేషన్ రావడంతో శ్రీవాణి ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయ అనుభవం లేకపోయినా, ప్రజలతో ఉన్న అనుబంధం, సేవా భావమే ఆమెను విజయపథంలో నిలిపింది.
సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని శ్రీవాణి తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలతో పాటు మహిళలు, యువత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇచ్చి పల్లె సంస్కృతిని నిలబెట్టడమే తన అభిమతమని వెల్లడించారు.
ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, అవకాశం వచ్చినప్పుడు జానపద గేయాల్లో నాట్యాభినయం కొనసాగిస్తాను. పల్లె సంస్కృతిని కాపాడటం కూడా ప్రజాసేవలో భాగమే అని శ్రీవాణి చెప్పారు. జానపద కళాకారిణి నుంచి గ్రామ సర్పంచ్‌గా ఎదిగిన శ్రీవాణి ప్రయాణం, పల్లె మహిళలకు స్ఫూర్తినిచ్చే ఉదాహరణగా నిలుస్తోంది. బోటుమీదపల్లెకు ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధితో పాటు, పల్లె సంస్కృతిని ప్రతిబింబించే ప్రతీక దక్కిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..