Yadadri: యాదాద్రిలో దర్శనం, పూజలు, సేవల నుంచి రెంటల్ రూమ్స్ వరకు ధరల వివరాలు ఇవే

ఏడుకొండల ఎంకన్న తరహాలోనే.. యాదాద్రి నర్సన్న ఆలయంలో కూడ టికెట్లును ఆన్లైన్లో పొందే విధంగా ఏర్పాటు చేసింది యాదాద్రి దేవస్థానం. తిరుమల మాదిరిగానే వెబ్‌సైట్లలో టికెట్లు లభ్యం....

Yadadri: యాదాద్రిలో దర్శనం, పూజలు, సేవల నుంచి రెంటల్ రూమ్స్ వరకు ధరల వివరాలు ఇవే
Yadadri Temple

Updated on: Feb 11, 2023 | 6:01 PM

ఇల వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలతో సమానంగా యాదాద్రిలో ఆలయనిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దారు. ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్‌తో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం టికెట్ పొందవచ్చు.  వెబ్ సైట్ ద్వారా అన్లైన్‌లో టికెట్స్ పొందేవిధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ‘yadadritemple.telangana. gov.in  వెబ్‌సైట్ సందర్శించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఇదే వెబ్ సైట్ నుంచి ఈ హుండీ ద్వారా డొనేషన్స్ కూడా ఇవ్వవచ్చు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుకల్యాణ మహోత్సవం-2023 టికెట్లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

తిరుకల్యాణ మహోత్సవం-2023 టికెట్ల ధర 3వేలుగా నిర్ణయించారు. ఈనెల 28న ఉత్సవం జరగనుంది. ఆన్​లైన్ ​బుకింగ్​లో పేరు, గోత్రం,  పూజ వివరాలు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, తేదీ, ఎన్ని టికెట్లు, అడ్రస్, ఆధార్ నెంబర్, ఆలయ సందర్శన వేళ వంటి వివరాలు నింపాలి. కాగా యాదాద్రిలో స్కూటర్ పూజ రూ.300, ఆటో పూజ రూ.400, కారు పూజ రూ.500, బస్సు, లారీ, ట్రాక్టర్ పూజ రూ.1000గా ఫిక్స్ చేవారు. ఇక శాశ్వత నిత్యపూజ 10 సంవత్సరాలు రూ.15వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన రూ.15వేలుగా నిర్ణయించారు. అష్టోత్తర ఘటాభిషేకం రూ.1000, దర్బార్ సేవ రూ.516, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం రూ.800, స్వర్ణపుష్పార్చన రూ.600, శయనోత్సవం రూ.100,  సుప్రభాత దర్శనం రూ.100 గా రేట్లు నిర్ణయించారు.

యాదాద్రిలో రాత్రి బసచేసే భక్తుల కోసం కొండ కింద రూమ్స్ ఉన్నాయి. లక్ష్మీ నిలయం నాన్ ఏసీకి రూ.560, లక్ష్మీనిలయం నాన్ ఏసీ డీలక్స్ రూమ్ రూ.1000గా ఫైనల్ చేశారు. సుధూర ప్రాంతాలను వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా..  యాదాద్రి ఆలయ కమిటీ ఆన్​లైన్​లో సేవలను అందుబాటులోకి తెచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..