Telangana: కల్లును దొంగలిస్తున్న దొంగలు.. ఈ గౌడ్ అన్న వారికి ఎలా చెక్ పెట్టాడంటే..

గీత కార్మికుల సమస్యలు కొత్తవి కావు. ప్రకృతి, ప్రమాదాలు, తక్కువ ఆదాయం... వీటికి తోడు ప్రకృతి వరప్రసాదమైన కల్లు దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నాలజీని ఉపయోగించి కల్లు దొంగలకు చెక్ పెట్టాడు ఓ గీత కార్మికుడు. తన జీవనోపాధిని కాపాడుకునేందుకు గీత కార్మికుడు చేసిన వినూత్న ప్రయోగం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: కల్లును దొంగలిస్తున్న దొంగలు.. ఈ గౌడ్ అన్న వారికి ఎలా చెక్ పెట్టాడంటే..
Rural Innovation

Edited By:

Updated on: Aug 03, 2026 | 1:43 PM

టెక్నాలజీని అవసరానికి అనుగుణంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందనే విషయాన్ని తెలంగాణకు చెందిన ఓ గీత కార్మికుడు నిరూపించాడు. కష్టపడి గీసిన తాటికల్లును తరచూ దొంగలు ఎత్తుకెళ్తుండటంతో విసిగిపోయిన అతడు.. పోలీసులపై లేదా అదృష్టంపై ఆధారపడకుండా వినూత్నంగా ఆలోచించాడు. తాటి చెట్టుకే సీసీ కెమెరా అమర్చి దొంగల ఆటకు చెక్ పెట్టాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కు చెందిన అన్నెపు శ్రవణ్ గౌడ్ గీత కార్మికుడు. తాటికల్లే అతని కుటుంబానికి జీవనాధారం. ప్రతిరోజూ తెల్లవారుజామునే తాటి చెట్లు ఎక్కి కల్లు గీసి కుండలు కడతాడు. ఆ తర్వాత ఉదయం వాటిని దించి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో తాటి చెట్లెక్కి కుండల్లో ఉన్న కల్లును దొంగిలించడం ప్రారంభించారు. ఉదయం కుండలు దించేందుకు వెళ్లిన శ్రవణ్‌కు అవి ఖాళీగా కనిపించడంతో తీవ్ర నిరాశ ఎదురయ్యేది. రోజంతా శ్రమించి సంపాదించాల్సిన ఆదాయం ఇలా దొంగల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు, వ్యవసాయ పొలాల్లో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గమనించిన శ్రవణ్‌కు ఓ ఆలోచన వచ్చింది. అదే సాంకేతికతను తన వృత్తికి కూడా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సుమారు రూ.12 వేల ఖర్చుతో సోలార్ సీసీ కెమెరాను కొనుగోలు చేసి తాటి చెట్టుపైనే ఏర్పాటు చేశాడు.

చెట్టుపై కుండల సమీపంలో అమర్చిన ఈ కెమెరా రాత్రింబవళ్లు ప్రతి కదలికను రికార్డు చేస్తోంది. చీకటి సమయంలో ఎవరైనా చెట్టెక్కినా, కుండలను తాకినా లేదా కల్లు దొంగిలించే ప్రయత్నం చేసినా మొత్తం దృశ్యాలు స్పష్టంగా కెమెరాలో నమోదవుతున్నాయి. దీంతో దొంగలు కూడా చెట్టువైపు రావడానికి భయపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

కల్లును మాత్రమే కాదు.. తన కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి శ్రవణ్ గౌడ్ టెక్నాలజీని ఆయుధంగా మార్చుకున్నాడు. సాధారణంగా సీసీ కెమెరాలు ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో కనిపిస్తుంటాయి. కానీ తాటి చెట్టుపై సీసీ కెమెరా ఏర్పాటు చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

గీత కార్మికుడి ఈ వినూత్న ఆలోచన ప్రస్తుతం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆధునిక సాంకేతికతను గ్రామీణ జీవనోపాధికి అనుసంధానం చేస్తే చిన్న చిన్న సమస్యలకు కూడా సమర్థవంతమైన పరిష్కారాలు దొరుకుతాయని శ్రవణ్ గౌడ్ నిరూపించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us