Telangana: లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. వారిని ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్

|

Jun 02, 2022 | 8:13 AM

లారీలో ప్రయాణిస్తున్న ఏపీకి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు వారు లారీలో ఎందుకు ప్రయాణిస్తున్నారు..? అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసుకుందాం పదండి.

Telangana: లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. వారిని ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్
A representative image
Follow us on

డ్రగ్స్ సరఫరా చేసేవారు, డ్రగ్స్ వినియోగించేవారు మస్త్ షేడ్స్ చూపిస్తున్నారు. పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారుల కంట పడకుండా ఉండేందుకు క్రియేటివ్ టెక్నిక్స్ వాడుతున్నారు. అయినా కొందరు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా డ్రగ్స్ తరలిస్తున్న ఏపీ(Andhra Pradesh)కి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri bhuvanagiri district) చౌటుప్పల్‌(Choutuppal)లో రాచకొండ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డ్రగ్స్‌, 2 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు.  పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితులు లారీలో ప్రయాణించాలనుకున్నారు. కానీ పక్కా సమాచారం మేరకు ఖాకీలు గత నెల 28న మధ్యాహ్నం చౌటుప్పల్‌ బస్టాండ్‌ వద్ద లారీని ఆపి సూర్యసంపత్‌, దీపక్‌ ఫణీంద్రలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్‌ విలువ రూ.2.35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్‌కు చెందిన తీగల దీపక్‌ ఫణీంద్ర, కాకినాడ జిల్లా పెద్దపూడి మండం గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్యసంపత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. కోవిడ్ నేపథ్యంలో వీరు గత కొంతకాలంగా రాజమహేంద్రవరం నుంచి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే ఎక్కడ అలవాటయ్యారో తెలీదు కానీ.. వీరు డ్రగ్స్‌కు అడిక్ట్ అయ్యారు. ఈ నెల 25న గోవాలోని ఓ డ్రగ్ పెడ్లర్ వద్ద ఎండీఎంఏ డ్రగ్స్‌(25 ట్యాబ్లెట్స్), ఎల్‌ఎస్‌డీ(2 స్ట్రిప్స్‌) కొన్నారు. అనంతరం అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆపై లోకల్ పోలీసుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. వీరు పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు వద్ద లారీ ఎక్కి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతో.. పోలీసులు మాటు వేసి వీరిని పట్టుకున్నారు. నిందితులు డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు ఇతరులకు అమ్ముతారని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి చౌటుప్పల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట నిందితులను హాజరుపరిచి నల్గొండ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.