Wood Smuggling: మంచిర్యాల జిల్లా కోటపల్లి సరిహద్దు మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి కొంతకాలంగా తగ్గిన టేకు కలప అక్రమ రవాణా ఇటీవల కాలంలో తిరిగి పుంజుకుంది. అధికారులు నిత్యం దాడులు చేస్తూ వాహనాలు సీజ్ చేస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. పకడ్బందీగా సమాచార వ్యవస్థ, బీట్ కో అధికారి, వాహన సదుపాయం తదితర వసతులు ఉన్నప్పటికీ స్మగ్లర్లను అటవీ అధికారులు పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి ప్రాణహిత నదీ మీదుగా అక్రమంగా టేకు కలప దిగుమతి అవుతోంది.
మహారాష్ట్రలోని దట్టమైన అడవుల్లో లభ్యమయ్యే నాణ్యమైన కలప తక్కువ ధరలోనే దొరుకుతుండటంతో గృహ నిర్మాణదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. వీరి అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న కొంతమంది స్మగ్లర్లు అధికారుల కళ్లుగప్పి నేరుగా ఇంటి వద్దకే చేర్చుతున్నారు. చెన్నూరు పట్టణం పురపాలకగా మారడంతో ఒక్కసారిగా గృహనిర్మాణం ఊపందుకుంది. టింబర్ డిపోల్లో దొరికే కలప నాణ్యతను బట్టి ఫీట్‌కు 5వేల రూపాయల నుంచి 6వేల రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇందులో సగం ధరకే ‘మహా’ కలప దొరుకుతుండటంతో నిర్మాణాదారులు అక్రమ కలప వైపు మొగ్గుచూపుతున్నారు.
మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతానికి చెందిన స్మగ్లర్లు ఇవతలి వైపు వారితో ఒప్పందాలు చేసుకొని కలపను అందిస్తున్నారు. నది ఇవతలి ప్రాంతానికి చేర్చే వరకు వారు బాధ్యతలు తీసుకోవడం, అక్కడి నుంచి అదును చూసి తరలించే బాధ్యత ఇక్కడి వారు చూస్తుండటంతో కోట్లాది రూపాయల విలువ చేసే కర్ర అనుకున్న ప్రాంతానికి చేరుతోంది. కలపను రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసి తర్వాత సమయం చూసి తరలిస్తున్నారు. ఈక్రమంలో అధికారులకు పట్టుబడుతున్నది కొంతేకాగా పట్టుబడనిదే పెద్ద మొత్తంలో ఉంటోంది.
అధికారుల అనుమానాలకు ఏమాత్రం తావివ్వకుండా వివిధ వాహనాల్లో కలప తరలిస్తున్నారు. దర్వాజ, తలుపులు, కిటీకీలు తదితర గృహ అవసరాలకు అనుగుణంగా అక్కడే మార్చుకొని అందుకు అనుకూలమైన వాహనాలను వినియోగిస్తున్నారు. ఇందులో ఆటోలు, జీపులు, టాటా ఏస్, బోలేరో, ట్రాక్టర్లు అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న వాటిలో ఉంటున్నాయి. ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల నుంచి అరగంట సమయంలోనే చెన్నూరుకు చేరుకునే 63వ జాతీయ రహదారి సదుపాయం ఉండటం వారికి కలిసివచ్చే అంశంగా మారింది. పట్టుబడుతున్న దాంట్లో ఎక్కువగా తాజా, మాజీ, ప్రజాప్రతినిధులకు చెందినవారివే ఉంటున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు, నాయకుల ఫైరవీలతో ఎంతో కొంత చెల్లించి విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతుండటంతో కిందిస్థాయి సిబ్బంది శ్రమ వృథా అవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also read:
Viral Video: పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన.. వైరల్ అవుతున్న వీడియో.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు..!
Chanakya Niti: నిజమైన స్నేహితులెవరో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ నాలుగు లక్షణాలను గమనించండి..!