CM KCR on Paddy: యాసంగి మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం.. డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా జమః సీఎం కేసీఆర్
రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
CM KCR on Paddy procurement: రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర కేబినెట్(Telangana Cabinet) సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. క్వింటాల్ ధాన్యానికి రూ.1,960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
సివిల్ సప్లైస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటును పర్యవేక్షించాలనీ, కలెక్టర్లతో, సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించుకొని, గన్నీ బ్యాగుల సరఫరా, తదితర సమస్యలు లేకుండా సమర్థవంతంగా కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గతంలో మాదిరిగానే కనీస మద్దతు ధర చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది కనుక రాష్ట్రంలోని రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యం ఇతరులకు అమ్మి, నష్టపోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్రం దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానా పై పడే అధిక భారాన్ని భరిస్తూ, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందనీ ముఖ్యమంత్రి తెలిపారు.
యాసంగి వడ్లను కొనేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటి వేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్ళు, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి, చితికిపోయిన వ్యవసాయ రంగానికి పునర్జీవం తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రాష్ట్ర సర్కార్ తీసుకున్న చర్యల వల్ల ఒక కోటి ఎకరాల పంట విస్తీర్ణం పెరిగిందని, అందుకే పంటలు బాగా పండాయని వివరించారు. అయితే కేంద్రంలో పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక ప్రభుత్వం వుందని, ఇది భారత రైతాంగ దురదృష్టమని విరుచుకుపడ్డారు. 13 నెలల పాటు రైతాంగం ఢిల్లీలో ధర్నాకు దిగాయని, చివరికి కేంద్రం దిగివచ్చి, ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు. ఉద్యమాలు చేస్తున్న రైతులను మోదీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధింపులకు గురి చేసిందని, ఉగ్రవాదులుగా అభివర్ణించారని కేసీఆర్ మండిపడ్డారు.
దేశంలోని వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఓ బలమైన కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేస్తోందని కేసీఆర్ దుయ్యబట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామని బీజేపీ ఎన్నికల హామీలో పెట్టారని, అయినా దానిని అమలు చేయరని ఎద్దేవా చేశారు. వీటన్నింటితో పాటు ఎరువుల ధరలు కూడా పెంచారని మండిపడ్డారు. తాజా పార్లమెంట్ సమావేశాల్లో తమకు అవసరమైన బిల్లులను పాస్ చేయించుకున్నారే తప్పించి, రైతులకు అవసరమైన వాటిని మాత్రం ముట్టుకోలేదని మండిపడ్డారు.