
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్. ఈ సారి వేసవిలో రాష్ట్రంలో బీర్ల కొరత విపరీతంగా ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు నీటి సమస్యనే కారణంగా తెలుస్తోంది. సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మత్తులు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. దీని వల్ల నీటి సరఫరా నిలిపివేసే అవకాశముంది. ఈ కారణంతో సంగారెడ్డి జిల్లాలోని నాలుగు బేవరేజెస్ కంపెనీలకు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నాలుగు ప్రధాన కంపెనీలు బీర్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కంపెనీల్లో బీర్ల తయారీకి నీళ్లు అందుతోంది. ఇప్పుడు నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల బీర్ల ఉత్పత్తి తగ్గపోతుందని, దీని వల్ల బీర్లకు కొరత ఏర్పడతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం బీర్ల కంపెనీలకు సింగూరు ప్రాజెక్ట్ ద్వారా రోజూ 44 లక్షల లీటర్ల నీటి సరఫరా జరుగుతుంది. ఈ బేవరేజెస్ కంపెనీ ద్వారా దాదాపు 11 రాష్ట్రాల్లకు బీర్ల సరఫరా అవుతుంది. ఇప్పుడు సింగూర్ జలమండలి నుంచి నీళ్లు ఆగిపోవడం వల్ల తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా బీర్ల సరఫరా తగ్గిపోతుంది. దీని వల్ల ఆ రాష్ట్రాల్లో కూడా బీర్ల కొరత వేసవిలో ఏర్పడనుంది. ఈ వేసవిలో ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి మరమ్మత్తులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్దమవుతున్నారు. దీంతో బీర్ల ఉత్పత్తి కంపెనీలకు నీళ్లు బంద్ కావడం వల్ల కొరత ఏర్పడనుంది. దీంతో ఈ వేసవిలో చల్లని బీర్ తాగుతూ చీల్ అవ్వాలని కోరుకునే మందుబాబులకు షాక్ తగలనుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈ బేవరేజెస్ కంపెనీలకు తక్కువ ధరకే నీటిని సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ మరమ్మత్తుల తర్వాత నీటిని సరఫరా చేసేందుకు ఛార్జీలను పెంచే అవకాశముంది. ఇదే జరిగితే బీర్ల తయారీ కంపెనీలపై భారం పడనుంది. ఈ భారం తప్పించుకునేందుకు బీర్ల రేట్లను పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇక బీర్ల ఉత్పత్తి తగ్గితే ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లోని బేవరేజెస్ కంపెనీల నుంచి బీర్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు కానున్నాయి. ఈ కారణంతో కూడా వేసవిలో బీర్ల ధరలను పెంచే అవకాశముందని చెబుతున్నారు. ఇక నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల బీర్ల ఉత్పత్తి తగ్గి బేవరేజెస్ కంపెనీలకు ఆదాయం తగ్గనుంది. దీంతో బీర్ల తయారీ కంపెనీలు నష్టపోనున్నాయని చెబుతున్నారు. ఏదైనా రానున్న వేసవిలో బీరు ప్రియులకు షాక్ తప్పేలా కనిపించడం లేదు.