Telangana: భర్త గొర్రెలు కాచేందుకు వెళ్లడం లేదని దారుణం.. అర్థరాత్రి అంతా నిద్రలో ఉండగా భార్య ఏం చేసిందంటే..
నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ కుగ్రామం.. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు.. భార్య భర్త గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు.. ఈ క్రమంలో భర్త కల్లుకు బానిసై.. గొర్లు కాచేందుకు వెళ్లడం లేదు.. ఈ విషయంలో భర్తతో భార్య గొడవకు దిగింది.. ఘర్షణ ముగిసిన తర్వాత అందరూ నిద్రపోయారు.. అర్థరాత్రి వేళ భార్య భర్తను కిరాతకంగా చంపడం కలకలం రేపింది.
కట్టుకున్న భర్తను రోకలి బండతో కొట్టి కిరాతకంగా చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిద్రలో ఉండగానే భర్తను శాశ్వతనిద్రలోకి పంపించేసింది భార్య. ఈ ఘటనతో ఒక్కసారిగా నల్లమల ఉలిక్కిపడింది. వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల్ మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన రాములు గొర్లకాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాములు కు భార్య ఎల్లమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు.. ఒక ఏడాది వయసు గల బాబు ఉన్నారు.. భర్తతో కలిసే భార్య సైతం గొర్లు కాచేందుకు వెళ్తుంటుంది. అప్పుడప్పుడు గ్రామంలో కూలీ పనిచేస్తుంది. అయితే గడచిన కొద్ది రోజులుగా వీరి సంసారంలో తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాములు కల్లుకు బానిసై… గొర్లు కాచేందుకు వెళ్లకపోవడంతో గొడవలు మరింత ముదిరాయి. అయితే ఈ క్రమంలోనే గత రాత్రి మాటమాట పెరిగి భార్యభర్తల ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఎప్పటిలాగే గొడవ ముగిసాక నిద్రకు ఉపక్రమించారు. తరచూ గొడవల అంశాన్ని మనసులో పెట్టుకున్నదో.. లేక వేరే సంగతి ఏమైనా ఉన్నదో తెలీదు కానీ అర్దరాత్రి భర్తపై రోకలి బండతో దాడి చేసింది భార్య ఎల్లమ్మ. మత్తులో ఉండడంతో రాములు ప్రతిఘటించలేకపోవడంతో భార్య రోకలితో పలుమార్లు కొట్టి హత్య చేసింది.
ఉదయం విషయం గమనించిన స్థానికులు భర్త కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే భర్త రాములు, భార్య ఎల్లమ్మ ఇద్దరు కల్లుకు బానిసై ప్రతిరోజూ గొడవపడుతున్నారని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. ఇక ఘటనాస్థలికి చెరుకుని పోలీసులు వివరాలు సేకరించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాములు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఉన్న బాబు ఉన్నారు.. తండ్రిని చంపిన తల్లి జైలుకు వెళ్లాల్సిన స్థితి రావడంతో పిల్లల బాగోగులు చూసేదెవరని కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా నల్లమల అటవీ గ్రామాల్లో ఉలికిపాటుకు గురిచేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..