
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ సంతోషంగా కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాల్లో మునిగిపోతారు. కానీ ఆ గ్రామంలో హోలీ నాడు ప్రజలు వారు చిటికెడు రంగు సైతం ముట్టుకోరు. దీన్ని వెనక ఓ ఆచారం ఉంది. అవును.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు (వెంకటంపేట) గ్రామంలో హోలీ పండుగను జరుపుకోరు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతుండగా.. ఇందుకు విరుద్ధంగా వింత ఆచారం ఉంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిన హోలీ పండుగను జరుపుకుంటారు. కానీ వెంకటంపేటలో మాత్రం పౌర్ణమికి ఒక రోజు ముందు శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి దేవాలయం నుండి స్వామి వారిని తీసుకువచ్చి కామ దాహనం చేస్తారు. ఆ తర్వాత గ్రామంలోని గుట్టపై ఉన్న మరో ఆలయానికి స్వామివారినీ తీసుకువస్తారు. ఆ రోజు నుండి 11 రోజులపాటు శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
ఈ బ్రహ్మోత్సవాల సమయంలోనే హోలీ పండుగ రావడంతో గ్రామస్తులు హోలీ పండుగను జరుపుకోరు. హోలీ నాడు గ్రామస్తులు చిటికెడు రంగు సైతం ముట్టుకోరు. ఇది తమ పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుండటంతో అదే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామిని కొండ నుండి కిందికి తీసుకువచ్చి ఊరంతా వనవాసానికి వెళ్తుంటారు. మరుసటి రోజు బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒక్కరిసారిగా హోలీ పండగలో మునిగిపోతారనీ గ్రామస్తులు చెబుతున్నారు. దేశమంతా ఒకే రోజు హోలీ పండుగలు జరుపుకుంటే తాము మాత్రం వారం రోజుల తర్వాత హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటామని చెబుతున్నారు.