
చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సామాన్యులనే కాదు అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో యాసంగి సాగుపై కోలుకోలేని దెబ్బ పడుతోంది. ప్రధానంగా వరి నారుమళ్లు ఎదగడం లేదు. చాలా చోట్ల అవి పసుపు రంగులోకి మారి ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వరి నారుమళ్ళు పెరిగడం లేదు. దీంతో రైతులు మళ్లీ నారుమళ్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా 25 రోజుల్లో పెరగాల్సిన నారు.. 40 రోజులు గడిచినా నాటుకు రాకపోవడంతో యాసంగి సాగు ఆలస్యమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల రైతులు ఈ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాటికే వరి నాట్లు వేసింది ఉండే కానీ నారుమళ్లు సరిగ్గా పెరగలేదు. రబీ సీజన్ ప్రారంభమై నాట్లు వేయాల్సిన సమయం ఆసన్నమైనా. పొలాల్లో ఎక్కడా పచ్చదనం కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోవడంతో నారుమళ్లు అసలు పెరగడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతున్నాయి. చలి తీవ్రతకు భూమి వేడెక్కకపోవడం, నారుమళ్లకు సూర్యరశ్మి తగినంతగా తగలకపోవడంతో అవి పెరగడం లేదు. ఫలితంగా వరి నారు ఎదుగుదల నిలిచిపోతు న్నాయి. దీంతో రైతులు మళ్లీ నారుమళ్లు పోస్తున్నారు..
ఎకరానికి అన్ని కలుపుకొని రూ.5000 వరకు ఖర్చు వస్తుంది. ఇప్పటికే ఒకసారి ఖర్చులు భరించి నారుమళ్లు పోయాగా. అవి పెరగకపోవడంతో మళ్లీ ఖర్చు పెట్టి నారుమళ్లు పోస్తున్నారు. డబుల్ ఖర్చుతో పాటు సమయం కూడా వృధా అవుతుంది రైతులది. వీటితో పాటు లేట్ అవ్వడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. పంట చేతికి రావడం ఆలస్యం అవుతుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక పంట చేతికి రావడం ఆలస్యం అవ్వడంతో పాటు అప్పటికీ వడగండ్ల వానలు వస్తె పంట మొత్తం చేతికి రాకుండా పోతుంది అని వాపోతున్నారు. ఇక చలి నుండి నారుమళ్లను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ అధికారులు రాత్రి వేళల్లో నారుమళ్లలో నీరు నిల్వ ఉంచి, ఉదయాన్నే ఆ నీటిని తీసేయాలని సూచిస్తున్నారు. మరికొందరు రైతులు నారుమళ్లపై ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉష్ణోగ్రతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఉమ్మడి మెదక్ వంటి జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉండటంతో నాట్లు నెల రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇదే అదునుగా భావించి కొంతమంది ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు వాళ్ళకి తోచిన పిచికారి మందులను రైతులకు అంటగడుతున్నారు. ఇలాంటివి అన్ని నమ్మి మోసపోవద్దు అ అధికారులు సూచిస్తున్నారు. చాలా చోట్ల జీఏ3 అనే పిచికారి మందును నారుమళ్లకు కొడుతున్నారు. దీని వల్ల నారుమళ్లు ఆకులు వెడల్పు అయ్యి దిగుబడి మీద ఎఫెక్ట్ పడుతుందని దాన్ని వాడవద్దు రైతులు చెబుతున్నారు. 13405 మల్టీ కే…జింక్ ఎడిట్ అనే పిచికారి మందులు వాడాలి అని సూచిస్తున్నారు. ఇక నారుమళ్ల నుండి ఉదయాన్నే నీటిని మొత్తం తీసేసి, వాటిలో బోరు నుండి వచ్చే వేడి నీటిని పంపాలని అధికారులు సూచిస్తున్నారు.