
తెలంగాణలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. మరో రెండు మూడు నెలలు మాత్రమే ఎన్నికలకు గడువుంది. దీంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్‌ను గద్దె దించాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కంకణం కట్టుకుంటే.. ముచ్చటగా మూడోసారి అధికారం మాదేనని గులాబీ దండు ధీమాతో ఉంది. మహబూబ్‌నగర్ ప్రజాగర్జనలో వరాలు ప్రకటించారు ప్రధాని మోదీ. నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోదీ.. 2 ప్రతిష్టాత్మక నిర్ణయాలు ప్రకటించారు. చాలా కాలంగా తెలంగాణలో పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుపై డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిపై మోదీ కీలక ప్రకటన చేయడంతో బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక తుక్కుగూడలో విజయభేరి సభా వేదికగా సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.
కర్ణాటకలో 5 హామీల గ్యారంటీ కార్డ్ కాంగ్రెస్‌కు అధికారాన్ని తెచ్చిపెట్టింది. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటు వేర్వేరు డిక్లరేషన్లతో అధికారంలోకి వస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పరంగా పెద్దగా కార్యక్రమాలు నిర్వహించన్పటికీ.. ప్రభుత్వం తరపున కార్యక్రమాలను నిర్వహిస్తూ తొమ్మిదేళ్ళ పాలనలో ఏం చేశామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. కలెక్టరేట్ల కొత్త భవనాలు, హౌజింగ్ కాలనీల ప్రారంభోత్సవాలలో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. బీజేపీ హామీలు.. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మబోరన్న మంత్రి హరీష్‌రావు.. త్వరలోనే అద్భుతమైన మేనిఫోస్టో ప్రకటిస్తామని ప్రజల్లో ఆశలు పెంచారు.
ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదు. కానీ ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. ఏం చెబితే ఇంప్రెస్ అవుతారన్న దానిపై లెక్కలేసుకుంటున్నాయి. హామీలు, గ్యారంటీలు, ప్రకటనలతో ఆకట్టుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం