Rain Alert: వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!

ఉత్తరాంధ్ర కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి వేడి తగ్గి పరిసరాలు కూల్‌కూల్‌గా మారుతున్నాయి. ఈసారి రుతుపవనాలు ముందే వచ్చినప్పటికీ గత పది రోజులుగా మందగించడంతో..

Rain Alert: వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!
Weather Report

Updated on: Jun 12, 2025 | 10:10 AM

హైదరాబాద్, జూన్‌ 12: నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి వేడి తగ్గి పరిసరాలు కూల్‌కూల్‌గా మారుతున్నాయి. ఈసారి రుతుపవనాలు ముందే వచ్చినప్పటికీ గత పది రోజులుగా మందగించడంతో వానల జాడ కానరాకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నేటి నుంచి 4 రోజులపాటు తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, హైదర్‌నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

ఇక తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీం, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో తెలంగాణ లోని పది జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలో సగటున 7.9 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ సీజన్‌లో తొలి11 రోజుల్లో 3.37 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా బుధవారం సాయంత్రానికి 2.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా మాటూర్‌లో 4.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో పొలాల్లో ప‌ని చేసుకునే రైతులు ప‌లు జాగ్రత్తలు తీసుకోవాల‌ని IMD సూచించింది. మెరుపులు మెరిసే స‌మ‌యంలో చెట్ల కింద‌, విద్యుత్ స్తంభాల‌కు స‌మీపంలో ఉండ‌కూడ‌ద‌ని తెలిపింది.

వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సీయస్‌ తక్కువగా నమోదైంది. గరిష్టంగా అదిలాబాద్‌లో 33.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20 డిగ్రీ సెల్సీయస్‌ నమోదైంది.ఇక ఈ రోజు (జూన్‌ 12) ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. గురువారం గరిష్టంగా నల్లగొండలో 36 డిగ్రీలు, కనిష్టంగా మహబూబ్ నగర్‌లో 30.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.