
దోచుకోవడానికి వెళితే తన్నులు బోనస్‌గా మిగిలాయి. తలుపు తడితే అదృష్టం వస్తుందనుకున్నారు కానీ…వాళ్ల దురదృష్టం ఈడ్చి తన్నింది. హైదరాబాద్ బేగంపేటలో తుపాకీతో ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలను జీవితంలో మర్చిపోలేని లెవెల్లో చితకబాదుడు బాదారు తల్లీకూతురు.
బేగంపేట పైగా కాలనీకి చెందిన ఆర్కే జైన్, అమిత భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆర్కే జైన్ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న తపంచా, కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు ఇద్దరూ కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. ఇక రెండో దొంగ కిచెన్‌లో దూరాడు.
మరోవైపు తుపాకీని లాక్కుని చితకబాదడంతో ఓ దొంగ పారిపోయాడు. అతడి వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. ఇక రెండో దొంగ కూడా కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తనకు కిక్ బాక్సింగ్ వచ్చని, కూతురి సాయంతో దొంగను ధైర్యంగా ఎదుర్కొన్నానని అమిత చెబుతున్నారు.
“నేను కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. డైలీ ఎక్సర్‌సైజులు చేసి ఫిట్‌గా ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉంటాను కాబట్టే దొంగను హ్యాండిల్ చేయగలిగాను. నా కూతురికి ఏమి జరగకూడదని వాళ్లతో శాయశక్తులా పోరాడాను” అని అమిత పేర్కొన్నారు.
ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను అక్కడివారు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులను యూపీకి చెందిన వారిగా గుర్తించారు. తల్లీకూతుళ్ల సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు.
Salute to these two #Hyderabadi #BraveWomen, fights with armed #Robbers .
Two armed men entered a house in #Begumpet, #Hyderabad and threatened the occupants with pistol.
A woman and her daughter shouted for Help and fought with the robbers, but they fled away. @hydcitypolice pic.twitter.com/vTQNmreVCJ— Surya Reddy (@jsuryareddy) March 21, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…