నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావ్.. కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్..

వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సోషల్ మీడియా ఇంచార్జ్ అడప మహేష్‌పై హత్యాయత్నం జరిగింది. మాట్లాడుదామని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించిన రౌడీషీటర్ పత్తి కుమార్, తనపై ఎమ్మెల్యేకు ఏమి చెప్పావంటూ ప్రశ్నించి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావ్.. కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్..
Warangal

Edited By:

Updated on: Jul 19, 2026 | 8:48 AM

ఓ రౌడీ షీటర్ బరితెగించాడు.. మాట్లాడుదామని పిలిచి మర్డర్ స్కెచ్ వేశాడు.. కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.. ప్రాణాయపాస్థితిలో ఉన్న ఆ నాయకుడిని కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ దారుణానికి పాల్పడిన రౌడీ షీటర్ పరారీలో ఉన్నట్టుగా సమాచారం.. వరంగల్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.. వర్ధన్నపేట నియోజక వర్గ పరిధిలోని 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సోషల్ మీడియా ఇంచార్జ్ అడప మహేష్ పై హత్యాయత్నం జరిగింది.. పత్తి కుమార్ అనే రౌడీషీటర్ ఇతనిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

60 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహేష్ ను స్థానికులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం మహేష్ ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు.. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రౌడీషీటర్ పత్తి కుమార్ తో పాటు మరోవ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది.. శనివారం రాత్రి తన ఇంటివద్ద ఉన్న మహేష్ కు జన్ను మధు అనేవ్యక్తి ఫోన్ చేసి కోటిలింగాల ఆలయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి పిలిచాడు.. అప్పటికే అక్కడ ప్లాన్ ప్రకారం మాటువేసిన రౌడీ షీటర్ పత్తి కుమార్ పథకం ప్రకారం దాడికి పాల్పడ్డాడు.

మద్యం తాగి ఉన్న రౌడీషీటర్ పత్తి కుమార్ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నావంటూ మహేష్ ఫోన్ ను లాక్కున్నాడు.. తనపై ఎమ్మెల్యేకు ఏం చెప్పావని బెదిరిస్తూ అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ మహేష్ పైన పోసి నిప్పుపెట్టాడు. ఒళ్ళంతా కాలిన గాయాలతో బయటపడ్డ మహేష్ అక్కడి నుండి NTR కాలనీకి చేరుకున్నాడు.. అతన్ని గమనించిన కాలనీవాసులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విషయం తెలిసిన వెంటనే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి మహేష్ ను పరామర్శించారు.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎంజీఎం సూపర్డెంట్ కు ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశించారు..

ఈ దారుణానికి పాల్పడ్డ రౌడీషీటర్ పత్తికుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us