వరంగల్ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఒక్కొక్కరి ఖాతాలో వేస్తామన్న 15 లక్షల మాటేమో కానీ.. పెట్రోల్, సిలిండర్ ధరలను మాత్రం అందకుండా చేశారని ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపైనా మాట తప్పారని మండిపడ్డ మంత్రి కేటీఆర్.. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోందంటూ తీవ్రంగా విమర్శించారు. గ్రేటర్ వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేసిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. 2500వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ చేరుకున్న మంత్రి కేటీఆర్.. మొదట రాంపూర్‌లో ఏర్పాటుచేసిన మిషన్‌భగీరథ వాటర్ ట్యాంకును ఓపెన్ చేశారు. మంచినీటి కోసం మొత్తం 1580 కోట్లను ఖర్చు పెట్టారు.
వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చిత్తశుద్దితో ఉన్నారన్నారు మంత్రి కేటీఆర్. కరోనాతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదన్నారు. ఎన్నిక ఏదైనా కేసీఆరే తమ నేతగా ఇప్పటి వరకు ఎలా తీర్పు ఇచ్చారో రాబోయే కార్పోరేషన్ ఎన్నికల్లోనూ అదే తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. కడుపునిండా రేషన్ బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. డబుల్‌బెడ్‌రూంల ప్రారంభోత్సవంతో పాటు రహదారులు, వరద కాల్వలు, వైకుంఠ ధామాలకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. 35 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రకాళి బండ్, ఆహ్లాదం పంచే పార్కులు, వివిధ జంక్షన్లను మంత్రి ప్రారంభించారు.
వందల కోట్లతో వరంగల్‌ను సీఎం అభివృద్ది చేస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఏ మొఖం పెట్టుకుని ఓటు అడుగుతారంటూ కాంగ్రెస్, బీజేపీలను నిలదీశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి నీళ్లివ్వడం అభినందనీయమన్నారు మరో మంత్రి సత్యవతి రాథోడ్. అటు.. వరంగల్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసులు అరెస్టు చేశారు. కాగా యువతను రెచ్చగొట్టి దౌర్బాగ్యపు రాజకీయాలు చేస్తున్నారంటూ కేటీఆర్ ఫైరయ్యారు.
Also Read: పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్
ప్రపంచంలో ఇది అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు.. దీన్ని తాకినా కూడా ఔట్