
పేపర్ లీక్ వ్యవహారంలో కుట్రకోణాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ బయటపెట్టారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారని ఆయన చెప్పడం ఈ మొత్తం వ్యవహారంలో హైలైట్‌గా నిలుస్తోంది. బండి సంజయ్ డైరెక్షన్‌లోనే లీకేజీ ప్రచారం జరిగిందని చెప్పారాయన. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనేది అర్థమవుతోందని బిగ్‌బాంగ్ పేల్చారు CP రంగనాథ్. టెన్త్ పేపర్ లీకేజీలో నిందుతులు కేవలం బండి సంజయ్‌తోనే మాట్లాడారని CP ఆధారాలు బయటపెట్టారు. బండి సంజయ్‌కి ప్రశాంత్ పేపర్ పంపించాడని చెప్పారు. అలాగే మహేష్ కూడా సంజయ్‌కి పేపర్ పంపించాడని తెలిపారు. దీంతోపాటు బండి సంజయ్‌తో ప్రశాంత్ చాటింగ్ చేశాడని సీపీ వివరించారు. తరచూ బండి సంజయ్, ప్రశాంత్ మాట్లాడుకుంటారని కూడా కీలకమైన అంశాన్ని బయటపెట్టారు.
ఈ సంరద్భంలోనే బండి సంజయ్‌పై సీపీ ప్రశ్నల వర్షం కురిపించారు. తన దగ్గర ఫోన్ లేదని బండి సంజయ్ చెప్పారని చెప్పారాయన. ఆధారాలు బయటికి వస్తాయనే ఫోన్ ఇవ్వలేదన్నారు. వాట్సాప్ డేటాను కొందరు డిలీట్ చేశారని చెప్పారు. వాట్సాప్ మెసేజ్‌లను రిట్రీవ్ చేస్తున్నామన్నారు. ఈ విచారణకు కొంత సమయం పడుతుందని సీపీ రంగనాథ్ చెప్పారు.
అదేసమయంలో బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాస్తున్నారని సీపీ రంగనాథ్ కీలకమైన పాయింట్‌ని లేవనెత్తారు. ఆయన నిర్దోషి అయితే ఫోన్ దాయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఫోన్ తెస్తే సగం ప్రశ్నలకు సమాధానాలు దొరికేవి అన్నారాయన. సోమవారం సాయంత్రం ప్రశాంత్, బండి మధ్య వాట్సప్ చాట్ జరిగిందని సీపీ చెప్పారు. ప్రశాంత్‌తో బండి వాట్సప్‌కాల్ కూడా మాట్లాడారన్నారు.
బండి సంజయ్ అరెస్ట్‌పై వస్తోన్న వార్తలపై సీపీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చని బీజేపీ నేతల ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారాయన. 41-CRPCలో నోటీసులు ఇవ్వాలని లేదని వివరించారు. అలాగే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు కాబట్టి లోక్‌సభ స్పీకర్‌కు ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు. పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశామని తేల్చిచెప్పారు రంగనాథ్.
ఇక టెన్త్ పేపర్ లీకేజీలో ఎ-1గా బండిసంజయ్ పేరు పెట్టడం దుమారం రేపుతోంది. 120b, 420, 447, 505(1)(b), సెక్షన్ 4 కింద కేసు పెట్టారు. ఈ కేసులో ఎ-2గా ప్రశాంత్, ఎ-3గా మహేష్, ఎ-5గా శివగణేష్, ఎ-6గా సుభాష్, ఎ-7గా శశాంక్, ఎ-8గా శ్రీకాంత్, ఎ-9గా శ్రామిక్, ఎ-10గా వర్షిత్ పేరు పెట్టారు.
ఈ మొత్తం వ్యవహరాంలో కుట్ర ఉంటే బండి సంజయ్‌నే ఎందుకు అరెస్ట్ చేస్తామని సీపీ రంగనాథ్ నిలదీశారు. మిగతా బీజేపీ నేతలపై మేం ఎందుకు కేసు పెట్టలేదని కూడా ప్రశ్నించారు. ప్లాన్ చేశారు కాబట్టే బండిసంజయ్‌ను ఎ-1గా పెట్టామన్నారు. దీంతోపాటు బండి సంజయ్ కంటే ముందు ఈటలకు పేపర్ పంపారని సీపీ రంగనాథ్ వివరించారు. ఇద్దరు ఈటల పీఏలకు ప్రశాంత్ పేపర్ పంపించాడని చెప్పారు.
ఈ లీకేజీ వ్యవహారంలో ఎగ్జామ్స్‌ను రద్దు చేయించాలనే దురుద్దేశం కనిపిస్తోందని సీపీ రంగనాథ్ చెప్పారు. విద్యార్థులను గందరగోళానికి గురిచేయడానికి ఇలా చేశారని భావిస్తున్నామన్నారు. కమలాపూర్ పీఎస్‌లో నమోదైన కేసులో నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చామన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద 3 నుంచి 7 ఏళ్ల శిక్ష పడుతుందని సీపీ రంగనాథ్ చెబుతున్న మాట.
ఒకవైపు బీజేపీ నేతల ఎదురుదాడి, మరకోవైపు పోలీసులు చెబుతున్న బలమైన ఆధారాలు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రబిందువు బండి సంజయేనని పోలీసులు ఇప్పటిదాకా నిర్థారించారు. దీంతో ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం